Party Defection | బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కీలక తీర్పు వెలువరించారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్లపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు.
పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ ఎలాంటి విచారణ జరుపకుండా నెలలపాటు సాగదీసిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సాగదీతపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసింది. స్పీకర్‌పై పలు వ్యాఖ్యలు చేసింది. మూడు నెలల్లో తేల్చాలని, జూలై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 21తో గడువు ముగిసినా, తేల్చకపోవడంపై మండిపడింది. స్పీకర్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాదు నాలుగు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని గత నెల 17న తుది గడువు విధించింది. ‘స్పీకర్ చర్యలు కోర్టు ధిక్కారమే. నాలుగువారాల్లో నిర్ణయం తీసుకోండి. లేదా నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ నెల 18వ తేదీ (గురువారం)లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే స్పీకర్ కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. కాబట్టి హడావుడిగా తీర్పు వెలువరించారని చర్చ జరుగుతున్నది.
కాగా, ఐదుగురికి సంబంధించి తీర్పు ఇచ్చామని, మిగిలిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని స్పీకర్ సుప్రీంకోర్టును కోరే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలో నోటీసులు ఇవ్వగా, ఇప్పటివరకు ఎనిమిది మంది మాత్రమే సమాధానం ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేరుగా స్పీకర్‌ను కలిసి సమాధానం ఇవ్వడానికి మరికొంత సమయం కోరారు. దానం నాగేందర్ ఇప్పటివరకు స్పందించలేదు. గురువారం నాటి సుప్రీంకోర్టు విచారణ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.