ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సుమారు 1,300 ఎకరాల సువిశాల ప్రదేశంలో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. 400 మంది అతిథులు కూర్చునేలా బాహుబలి వేదిక ముస్తాబవుతున్నది.
BRS | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. పార్టీ తలపెట్టిన ఆవిర్భావ సభకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో సభ జరిగే ఎల్కతుర్తితోపాటు గ్రామగ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో పార్టీ జెండా గద్దెల నిర్మాణం, పోస్టర్లు విడుదల చేయడం, గోడలపై రాతలు, జెండాల ఆవిష్కరణలతో పార్టీ శ్రేణులు బిజీబిజీ అయ్యాయి. ఎక్కడ చూసినా ఏప్రిల్ 27న (ఆదివారం) ఎల్కతుర్తిలో జరిగే తెలంగాణ ఇంటి పార్టీ రజతోత్సవ వేడుకల గురించే చర్చ జరుగుతున్నది. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎల్కతుర్తి సభ రికార్డు సృష్టిస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద సభ
ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న సభ దేశంలోనే అతిపెద్ద సభగా ఘనతకెక్కే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు జరుగుతున్న ఏర్పాట్లే దీనికి నిదర్శనం. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభను సుమారు 1,300 ఎకరాల్లో నిర్వహించలేదు. జాతీయ పార్టీలని చెప్పుకొనే పార్టీలు కూడా ఇప్పటివరకు ఇంతపెద్ద సభాస్థలి, ప్రాంగణాల్లో సభను నిర్వహించిన దాఖలాలు లేవు. ఎల్కతుర్తిలో జరిగే సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 12 వందలకుపైగా ఎకరాల్లో రైతుల నుంచి అనుమతి, నిరభ్యంతర పత్రాలను తీసుకున్నది. మరో వంద ఎకరాల వరకు కూడా రైతుల నుంచి నిరభ్యంతర పత్రాలను తీసుకోనున్నది. ఈ మొత్తం భూమిలో సుమారు 200 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండనున్నది. ఇక్కడ వేదికపైన ఉన్నవారు వేదిక చుట్టూ ఎక్కడి నుంచి చూసినా కనిపించేలా ఏర్పాట్లు చేశారు. దూరంగా ఉండేవారి కోసం పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు కూడా పెడుతున్నారు. 2010 డిసెంబర్ 16వ తేదీన కేసీఆర్ నేతృత్వంలోనే జరిగిన వరంగల్ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఆనాటి సభ దేశ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద సభగా జాతీయ మీడియా అభివర్ణించింది. ఇప్పుడు జరిగే సభ కూడా నాటి సభను తలదన్నేలా ఉంటుందని, బీఆర్ఎస్ పార్టీ సభల నిర్వహణలో తన రికార్డులను తానే తిరగరాసుకుంటుందని పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు.
400 మంది కూర్చునేలా వేదిక..
సభాస్థలిలో అతిపెద్ద వేదికను నిర్మిస్తున్నారు. 400 మందికిపైగా అతిథులు కూర్చునేలా సభా వేదికను నిర్మిస్తున్నారు. అదనంగా సెక్యూరిటీ సిబ్బంది, వాలంటీర్లు వేదికపై ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది బాహుబలి వేదికగా ఉంటుందని వేదిక నిర్మిస్తున్నవారు చెప్తున్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద వేదికను ఏ రాజకీయ, మతపరమైన సభల్లో కూడా ఏర్పాటు చేయలేదు.
10 వేలకుపైగా బస్సులు
సభకు వచ్చే ప్రజలు, కార్యకర్తల సౌకర్యార్థం పార్టీ 3వేలకుపైగా ఆర్టీసీ బస్సులను బుక్ చేసింది. దీనికి సంబంధించిన రూ.8 కోట్లను ఆర్టీసీకి చెల్లించింది. వీటితోపాటు ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన మూడువేలకుపైగా బస్సులను బుక్ చేశారు. మరో నాలుగు వేల బస్సులను స్కూళ్లు, వివిధ సంస్థల నుంచి తీసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రారంభమవుతున్నందున ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతర సంస్థల నుంచి వీటిని రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం పది వేలకుపైగా బస్సులు సభకు వచ్చే అవకాశం ఉన్నది. దీంతోపాటు ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలు కూడా రానున్నాయి. జీపులు, డీసీఎంలు, ట్రాక్టర్లు, కార్లలో వచ్చేవారి సంఖ్య బస్సుల్లో వచ్చేవారి కంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
భారీగా వసతులు
సభకు వచ్చేవారికి కనీస వసతులు కల్పిస్తున్నారు. తాగడానికి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. తొలుత పది లక్షల మజ్జిగ, పది లక్షల మంచినీళ్ల బాటిళ్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అయితే, సభకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని, అలాగే, ఎండలు కూడా ఎక్కువ ఉంటాయన్న కారణంతో మరిన్ని నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను సమకూరుస్తున్నారు. అలాగే, అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌లను, వైద్యులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వీఐపీ గదిని కూడా సిద్ధం చేస్తున్నారు. మైకులు, సౌండ్ సిస్టం కోసం కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనరేటర్లను కూడా సిద్ధంగా ఉంచారు.
తరలుతున్న శ్రేణులు
ఉద్యమనాటి పరిస్థితులను గుర్తు చేస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు అప్పుడే ఎల్కతుర్తి సభకు దండుగా కదలడం మొదలుపెట్టారు. దూరప్రాంతాల వారు సోమవారమే సిద్ధమయ్యారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్ వాసులు ఎడ్లబండ్లతో తమ ప్రయాణం మొదలుపెట్టారు. అలాగే, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కొందరు ఔత్సాహికులు కూడా అప్పుడే బయల్దేరారు. మెదక్ జిల్లాలోని అనేక నియోజకవర్గాల ప్రజలు బుధ, గురువారాల్లో పాదయాత్రగా బయల్దేరి ఎల్కతుర్తికి చేరేందుకు ప్రణాళికలు రచించారు. వీరు మార్గమధ్యంలో ఉండే గ్రామాల్లోని ప్రజలకు సభ గురించి చాటింపు చేస్తూ.. చైతన్యం చేస్తూ వెళ్లాలని భావిస్తున్నారు.
గ్రామాల్లో ఆరా తీస్తున్న నిఘావర్గాలు
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలోని నిఘావర్గాలు బీఆర్ఎస్ సభ కోసం ఎంత మంది తరలివెళ్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నాయి. గ్రామాలవారీగా ప్రతీ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే లెక్కలు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. సభకు ఎంత మంది వెళ్లవచ్చన్న అంచనా ఇవ్వాలని ప్రభుత్వ నిఘా విభాగం ఉన్నతాధికారులు జిల్లాల్లోని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఉన్నతాధికారులు గడిచిన రెండు రోజులుగా ప్రతీ రోజూ ఎన్ని బస్సులు, ఎన్ని కార్లు సభ కోసం సిద్ధమవుతున్నాయి? ఎంత మంది వెళ్లే అవకాశం ఉన్నది? అంటూ ఆరా తీస్తున్నారు.l కూడలిలో సభ.. రాకపోకలకు ఇబ్బందేలేదు
ఎల్కతుర్తిలో సభ నిర్వహించే ప్రాంగణం కూడలిలో ఉన్నది. దీంతో సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సభ వేదికకు మూడు వైపులా వాహనాల పార్కింగ్‌కు అవకాశం ఇచ్చారు. వరంగల్ నుంచి వచ్చే వారు వరంగల్ రహదారి వద్ద, కరీంనగర్ నుంచి వచ్చే వాళ్లు కరీంనగర్ రోడ్డు వద్ద, సిద్దిపేట వైపు నుంచి వచ్చే వారు వేదిక వద్ద ఉన్న సిద్దిపేట రోడ్డు వద్ద వాహనాలను నిలిపే అవకాశం ఉన్నది. ఏ వైపు నుంచి వచ్చినా ఐదు నిమిషాల్లోనే ప్రధాన వేదిక వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం వద్ద అంతర్గత రోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఏర్పాట్లు చేశారు.
‘హలో కార్మిక..చలో వరంగల్’ పోస్టర్ ఆవిష్కరణ
బీఆర్ఎస్ రజోత్సవ నేపథ్యంలో బీఆర్టీయూ ఆధ్వర్యంలో ‘హలో కార్మిక..చలో వరంగల్ పోస్టర్’ను హైదరాబాద్ తెలంగాణభవన్‌లో సోమవారం బీఆర్ఎస్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్మిక నేతలు రాంబాబు యాదవ్, మారయ్య, నారాయణ, అభిలాష్ పాల్గొన్నారు.