SP Gouse Alam | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)/ములుగు: తల్లుల మొక్కు కోసం మేడారం వచ్చా. నా భర్త అక్కడే డ్యూటీ చేస్తూ నన్ను క్యూలైన్లో పంపేందుకు ప్రయత్నిస్తుండగా పోలీస్ అధికారి గౌస్ ఆలం సరాసరి వచ్చి నా కండ్ల ముందే నా భర్తను గల్లా పట్టుకొని ఒక క్రిమినల్‌ను ఈడ్చుకుంటూ వెళ్లినట్టు తీసుకెళ్లి నేలపై కూర్చొబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. నేను వెళ్లి నా భర్తను వదిలేయండంటూ కాళ్లపై పడి భిక్షగత్తె లెక్క వేడుకున్నా.. అయినా ఆ కఠిన హృదయం కరగలేదు. ఇలాంటి అవమానం ఏ ఒక్కరికీ జరగొద్దు.. అంటూ ఏఆర్ ఎస్సై భార్య కన్నీటిపర్యంతమైంది. ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ఆలం కాఠిన్యంపై ఆమె ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మేడారం మహా జాతరలో విధులు నిర్వర్తించిన పోలీస్‌శాఖలోని కొందరు ఉన్నతాధికారుల వైఖరి విస్మయం కలిగించేలా, ఆ శాఖకే మచ్చ తెచ్చేలా మారింది. విధుల్లో ఉన్న ఆ శాఖ అధికారులపైనే దాడి ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వీటన్నింటికి కారణమైన పోలీస్ ఉన్నతాధికారులపై శాఖపరమైన చర్యలు ఉంటాయా? లేదా? అనే విషయం చర్చనీయంగా మారింది. ఆయా ఘటనలపై కొందరు తీసిన వీడియోలు శనివారం ఉదయం సోషల్ మీడియాలో ప్రత్యక్ష్యం కావడంతో పోలీసు అధికారుల దౌర్జన్యాలు వెలుగులోకి వచ్చాయి. మేడారంలో ఈ నెల 23న వరంగల్ పోలీస్ కమిషనర్ స్పెషల్ విభాగంలో పనిచేస్తున్న ఏఆర్ ఎస్సైని అతడి భార్య ముందే ఐపీఎస్ అధికారి కొట్టగా పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నెల 24న ఐపీఎస్ అధికారి ఏఆర్ ఎస్సైని కొట్టలేదని, ఇది అవాస్తవని ములుగు జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. ఇంతలోనే ఏఆర్ ఎస్సై భార్య తన కండ్ల ముందే తన భర్తను ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కొట్టాడని పేర్కొంటూ సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేశారు. వరంగల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం కూడా ఏఆర్ ఎస్సైపై దాడిని ఖండిస్తున్నట్టు ఆడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ రెండు అంశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చర్యలకు అటవీశాఖ సిబ్బంది డిమాండ్
అటవీశాఖలో శ్రీనివాస్ అనే ఫారెస్టు బీట్ ఆఫీసర్‌ను సైతం 23న అదే ఎస్పీ గౌస్ ఆలం హెలిప్యాడ్ చెక్‌పోస్టు వద్ద అతడి భార్య ముందే కొట్టాడని పేర్కొంటూ జిల్లా అటవీ శాఖ అధికారికి తెలంగాణ జూనియర్ ఫారెస్టు ఆఫీసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోనట్లయితే విధులను బహిష్కరిస్తామని ఫారెస్టు అధికారులు డీఎఫ్‌వోకు తేల్చి చెప్పారు. ఇతర పోలీస్ అధికారులు కూడా పలు చెక్‌పోస్టుల వద్ద మీడి యా ప్రతినిధులు, వీఐపీలు, భక్తులపై విరుచుపడిన ఘటనల వీడియోలు సోషల్ మీ డియాలో బయటకొస్తున్నాయి. పోలీస్ అధికారుల తీరు ఆ శాఖకు మచ్చ తెచ్చింది. వారి బంధువులు, కుటుంబ సభ్యుల దర్శనాల కోసం అడ్డుగా ఉన్న సాధారణ భక్తులను లాగి పడేసిన ఘటనలు మేడారం గద్దెల వద్ద చోటుచేసుకున్నాయి.