Southwest Monsoon | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): జూన్ 3,4 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరంలోకి ప్రవేశించనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే రుతుపవనాలు లక్షద్వీప్‌నకు చేరుకున్నాయని పేర్కొన్నది. రాష్ట్రంలో 5-10 తేదీల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని, 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులు ఉంటాయని వెల్లడించింది. దీంతో వచ్చే మూడురోజులు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిస్తాయని వివరించింది.
ఒకవైపు రుతుపవనాలు ముంచుకొస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతున్నదని పేర్కొన్నది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాబోయే రెండ్రోజులు సాధారణంకంటే 2 నుంచి 4డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యధికంగా మంచిర్యాల జిల్లా తాండూరులో 46.4 డిగ్రీలు నమోదైనట్టు తెలిపింది. పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 46.3, వరంగల్ జిల్లా సంగెంలో 46.3, భూపాలపల్లి జిల్లా కాటారంలో 46.2, ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో 46.2, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్టూరులో 46.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు వివరించింది. కాగా, బుధవారం ఒక్కరోజే వడదెబ్బకు 19మంది మృత్యువాతపడినట్టు తెలిపింది. రుతుపవనాలు ప్రవేశించేలోపు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది.