IBD | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): మన ఆహారపు అలవాట్లతోనే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ (ఐబీడీ) వస్తాయని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఒకప్పుడు యూరప్, యూఎస్‌లాంటి పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ప్రస్తుతం భారత్‌లోనూ విస్తరిస్తున్నదని తెలిపారు. ‘వరల్డ్ ఐబీడీ డే’ను పురస్కరించుకొని నిర్వహించిన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడంవల్లే దేశవ్యాప్తంగా 50 శాతం మంది ఐబీడీ బారినపడ్డట్టు తాజా సర్వేలో తేలిందని చెప్పారు. ఐబీడీ బాధితులు డయేరియా, బ్లడ్ మోషన్, కడుపు నొప్పి, ఎక్కువ సమయం బాత్రూమ్లో గడపడంలాంటి సమస్యలతో బాధపడుతారని వివరించారు. స్వచ్ఛమైన తాగునీరు, స్వచ్ఛమైన గాలివల్ల తెలంగాణలో ఈ కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నట్టు చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, ఉప్పు, చక్కెరలాంటి రిఫైన్డ్ పదార్థాల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి ఏటా 1.5 మిలియన్లకుపైగా ప్రజలు ఐబీడీ బారిన పడతున్నారని ఏఐజీ హాస్పిటల్స్ ఐబీడీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ రూపా బెనర్జీ వెల్లడించారు. ఇందులో 20 శాతంమంది పిల్లలున్నారని, దీనివల్ల వారి శారీరక ఎదుగుదలకు ఆటంకం కలుగుతున్నదని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికరణ్ మాట్లాడారు. అనంతరం పేగులకు ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలు, వాటి తయారీ విధానం తదితర అంశాలతో కూడిన పుస్తకాలను డాక్టర్ రూపా బెనర్జీ, డాక్టర్ శశికరణ్తో కలిసి డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు.