మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 19:59:42

మొదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించ‌నున్న‌ ద‌.మ‌.రైల్వే

మొదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించ‌నున్న‌ ద‌.మ‌.రైల్వే

సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా సాధారణ సరుకుల ర‌వాణాలో రైల్వేల మార్కెట్ వాటాను పెంచే లక్ష్యంతో ద‌క్షిణ మ‌ధ్య రైల్వే త్వరలో మొదటి కార్గో ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. సాధార‌ణ స‌రుకుల రైలు ఆగ‌స్టు 5వ తేదీన హైదరాబాద్‌లోని సనత్ నగర్ నుండి బ‌య‌ల్దేరి న్యూఢిల్లీలోని ఆద‌ర్శ్ న‌గ‌ర్‌కు చేరుకోనుంది. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఆరు నెల‌ల కాలానికి దీన్ని పైల‌ట్ ప్రాజెక్టుగా చేప‌ట్టింది. వారానికి ఓసారి ప్ర‌తీ బుధ‌వారం ఈ కార్గో ఎక్స‌ఫ్రెస్ న‌డ‌వ‌నుంది. 

బ‌ల్క్‌లో లేని వ‌స్తువుల ర‌వాణాకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చే సాధ‌నంగా ఇది ఉప‌యోగ‌ప‌డ‌నున్న‌ట్లు రైల్వే అధికారి తెలిపారు. గంట‌కు 50 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించే ఈ కార్గో రైలు 1700 కిలోమీట‌ర్ల దూరాన్ని 34 గంట‌ల్లో చేరుకోనున్న‌ట్లు చెప్పారు. ఈ రైలు ప్రతి బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి బయలుదేరి శుక్రవారం ఉదయం ఢిల్లీకి చేరుకుంటుంది. హైదరాబాద్ నుండి ఢిల్లీకి సరుకు ర‌కాల్నిబ‌ట్టీ రవాణా నిమిత్తం ట‌న్నుకు రూ. 2,500 వ‌సూలు చేయ‌నున్నారు. ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ గ‌జాన‌న్ మాల్యా మాట్లాడుతూ... 

ఈ విధానం ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, కార్గో మూవర్స్, చిన్న, మధ్యతరహా, మినీ ప్లాంట్ యజమానులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. వారు తమ సరుకుల‌ను రికార్డు స‌మ‌యంలో చాలా తక్కువ సుంకాలతో తరలించగలుగుతార‌న్నారు. ఆసక్తిగల వారు విచారణ కోసం హెల్ప్‌లైన్ నంబర్లు 9701371976 లేదా 040-27821393 కు కాల్ చేసి తెలుసుకుని వ్యాగన్లను బుక్ చేసుకోవచ్చు అన్నారు. వివ‌రాల కోసం https://scr.indianrailways.gov.in/cargoexpress కు లాగినై తెలుసుకోవ‌చ్చ‌న్నారు. 


logo