SCR | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ జారీ చేసింది. వారం రోజుల పాటు 32 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అదే సమయంలో పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రీషెడ్యూల్ చేసినట్లు తెలిపారు. ఈ వచ్చే శనివారం వరకు అమలులో ఉంటాయని చెప్పారు. డోర్నకల్-పాపటపల్లి మార్గంలో మూడో లైన్ మరమ్మతులు పనులు చేపడుతున్న నేపథ్యంలో ఆయా రైలు సర్వీసులపై ప్రభావం పడనుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్, స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్సిటీ, పూరి-ఓకా ద్వారకా ఎక్స్ప్రెస్, డోర్నకల్-కాజీపేట, విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే మెమో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు చెప్పింది.
అలాగే, పలు ప్రధాన రైళ్లను అధికారులు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్ప్రెస్ ఈ నెల13, 16, 17 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతుందని చెప్పారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు 15, 16, 18 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా వెళ్తుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ను ఈ నెల 14 నుంచి 18 వరకు కాజీపేట-గుంటూరు మధ్య పాక్షికంగా రద్దు చేశామని.. ఈ రైలు కేవలం సికింద్రాబాద్-కాజీపేట మధ్య మాత్రమే రాకపోకలు సాగిస్తుందని అధికారులు వివరించారు.