SCR | ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. పైలట్ల కొరత, చలికాలం, సాంకేతిక సమస్యలు, సిబ్బంది రోస్టర్ రూల్స్ నేపథ్యంలో ఇండిగో సంక్షోభంలోకి వెళ్లింది. దాంతో పెద్ద సంఖ్యలో విమానాలు రద్దవుతున్నాయి. దాంతో ప్రయాణికులు ఎయిర్పోర్స్లో పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే రంగంలోకి దిగింది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా మరికొన్ని మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు ప్రకటించింది. కొట్టాయం, నిజాముద్దీన్, యెలహంక, షాలిమార్‌కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు వెల్లడించింది.
07085 నంబరు గల రైలు హైదరాబాద్ (నాంపల్లి) నుంచి కొట్టాయానికి ఈ నెల 8న (సోమవారం) రాత్రి 9.50 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 5.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది. తిరిగి అదే 10న 07086 రైలు కొట్టాయం నుంచి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి.. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు నాంపల్లి చేరుకుంటుందని పేర్కొంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం జంక్షన్, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.
ఇక రైలు నంబర్ 07021 రైలు ఈ నెల 8న (సోమవారం) చర్లపల్లి నుంచి బయలుదేరి రాత్రి 9.45 గంటలకు బయలుదేరి బుధవారం వేకువ జామున 2 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకుంటుందని పేర్కొంది. 07022 రైలు నిజాముద్దీన్ నుంచి 10న (బుధవారం) ఉదయం 4గంటలకు బయలుదేరి గురువారం చర్లపల్లి స్టేషన్‌కు ఉదయం 6.30 గంటలకు చేరుకుటుందని వివరించింది. ఈ రైలు కాజిపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, నాగ్‌పూర్ జంక్షన్, ఇటార్సీ జంక్షన్, బినా జంక్షన్, విరాంగన ఝాన్సీ లక్ష్మీబాయి జంక్షన్, గ్వాలియర్, ఆగ్రా కాంట్ స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
రైలు నంబర్ 07187 రైలు చర్లపల్లి నుంచి యలహంక మధ్య నడుస్తుందని.. ఈ రైలు 8న రాత్రి 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు యలహంకకు చేరుకుంటుందని పేర్కొంది. 07188 రైలు యెలహంక నుంచి మధ్యాహ్నం 1గంటకు బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 4.30గంటకు రైలు చర్లపల్లికి వస్తుందని చెప్పింది. ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్లచర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, సత్యసాయి ప్రశాంతి నిలయం, హిందూపూర్ స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.
రైలు నంబర్ 07148 రైలు చర్లపల్లి నుంచి షాలీమార్కు నడుస్తుందని.. ఈ రైలు సోమవారం రాత్రి 9.35 గంటలకు బయలుదేరి.. మంగళవారం రాత్రి 11.50 గంటలకు గమ్యస్థానం చేరుతుందని తెలిపింది. 07149 రైలు తిరిగి 10న ఉదయం 12.10 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుందని పేర్కొంది. ఈ రైళ్లు గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం, బెర్హంపూర్, ఖుర్దా, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, సత్రగాచి స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ, సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని.. అడ్వాన్స్ టికెట్లు సైతం బుక్ చేసుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.