SCR | హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : లాభాలే లక్ష్యంగా ప్రత్యేక రైళ్ల పేరుతో దక్షిణ మధ్య రైల్వే దోపిడీకి పాల్పడుతూ ప్రయాణికుల జేబులకు చిల్లులు పెడుతున్నది. కొన్ని ప్రధాన మార్గాల్లో సాధారణ రైళ్లనే నడిపిస్తున్నప్పటికీ, అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారంటూ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేస్తున్నది. సాధారణ రైళ్ల సీట్ల రిజర్వేషన్ విషయంలో కృత్రిమ కొరత సృష్టించి, ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేలా చేస్తున్నట్టు తెలుస్తున్నది.
దీంతో తప్పని పరిస్థితిలో ప్రయాణికులు ప్రత్యేక రైళ్లలోనే ప్రయాణించాల్సి వస్తుంది. అయితే, రెగ్యులర్ చార్జీలనే భరించలేని ప్రయాణికుల నుంచి ప్రత్యేక రైళ్ల పేరుతో సాధారణ చార్జీలపై 30నుంచి 50శాతం వరకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు రెగ్యులర్ చార్జీ రూ.100 ఉంటే, అదనంగా రూ.50 కలిపి మొత్తం రూ.150 వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ టికెట్ల ద్వారా దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై టికెట్ కొనుగోళ్లతో అధికభారం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.