హైదరాబాద్: తెలంగాణ ప్రజలపై కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి ఉన్న గౌరవం మరోసారి తేటతెళ్లమైంది. 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న సోనియా గాంధీ (Sonia Gandhi).. వందలాది మంది తెలంగాణ యువకుల మరణాలకు కారణమైంది. దీంతో 2014లో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ వేడులకు ఆ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ప్రభుత్వం ఆహ్వానించింది. నాలుగు రోజుల క్రితం ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వయంగా సోనియాకు ఆహ్వానం అందజేశారు. దీంతో ఆమె రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారని ప్రభుత్వ వర్గాలు, పీసీసీ ప్రకటించాయి.
అయితే తాజాగా వేడుకలకు సోనియా గాంధీ డుమ్మాకొడుతున్నట్లు తెలుస్తున్నది. ఆరోగ్య సమస్యలతో రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా వచ్చే అవకాశం లేనట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈమేరకు పీసీసీ నేతలకు సమాచారం అందినట్లు సమాచారం. తీవ్రమైన ఎండల వల్ల ఆమె రాలేకపోవచ్చని పీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.