Gadwal | రాజోళి, అక్టోబర్ 23: ‘విధి రాతకు ఎవరూ అడ్డుపడలేరు’ అన్న పెద్దల మాటకు జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బుధవారం తెల్లవారుజామున భర్త చనిపోయిన మూడు గంటలకే మగబిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ. కొడుకును చూడకుండా తండ్రి అనంతలోకాలకు చేరితే.. భర్త అంత్యక్రియల్లో పాల్గొనలేని దుస్థితి ఆ భార్యది. రాజోళి మండలం తుమ్మలపల్లికి చెందిన కురువ కొత్తకోట శివ(28) కు నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బలపాలపల్లికి చెందిన లక్ష్మితో 14 నెలల కిందట వివాహమైంది. లక్ష్మి నిండు గర్భిణి.
శివ మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడి గాయపడ్డాడు. స్థానికులు ఏపీలోని కర్నూల్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి ఒంటిగంట ప్రాం తంలో మృతి చెందాడు. అతడి భార్య లక్ష్మి గర్భిణి కావడంతో ఆమె తల్లిగారిల్లు బలపాలపల్లికి వెళ్లింది. ఆమెకు పురిటినొప్పులు రావడంతో దవాఖానకు తరలించగా.. బుధవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాం తంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. లక్ష్మికి లో బీపీ ఉండటంతో భర్త మృతి విషయాన్ని కు టుంబీకులు చెప్పలేదు. చివరికి చెప్పడంతో ఆమె రోదనకు అంతులేకుండా పోయింది.