
నడిగూడెం, అక్టోబర్ 9: ‘నా చావుతోనైనా మందు మానాలి’ అని తండ్రిని వేడుకుంటూ ఓ కొడుకు తనువు చాలించాడు. మద్యానికి బానిసైన తండ్రి కారణంగా తల్లి పడుతున్న క్షోభను చూడలేక కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని రామాపురంలో చోటుచేసుకున్నది. రామాపురం గ్రామానికి చెందిన మేడం చిట్టమయ్యకు భార్య లక్ష్మి, కొడుకు మేడం గోపి ఉన్నారు. తండ్రి రోజూ మద్యం సేవించి తల్లిని వేధించడాన్ని కొడుకు గోపి (22) తట్టుకోలేకపోయాడు. పలుమార్లు తన మిత్రులతో చెప్పుకొని బాధపడ్డాడు. తల్లిని హిం సించొద్దని ఎన్నిసార్లు చెప్పినా తండ్రి తీరు మారలేదు. తన చావుతోనైనా మార్పు రావాలని తండ్రిని వేడుకుంటూ శనివారం శివారులోని మామిడి తోటలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి కోదాడ ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.