పెంచికల్పేట్, ఆగస్టు 11: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట్ మండలం లోడ్పల్లికి చెందిన పోతురాజుల భీమయ్య (52) సొంత అల్లుళ్ల చేతిలో శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. భీమయ్య కూతురు భర్త సెగం తిరుపతి, మేనల్లుడు బుర్సా మల్లేశ్ (వీగాం) తమకు రూ.3 వేలు ఇవ్వాలని మామను అడిగారు. భీమయ్య లేవని చెప్పడంతో గొడవకు దిగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న తిరుపతి, మల్లేశ్ మామపై కర్రలతో దాడి చేశారు. ఇంటి ముందున్న సిమెంట్ రోడ్డుపై రెండుసార్లు ఎత్తేశారు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య రాజక ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ప్రభాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కాగజ్నగర్ రూరల్ సీఐ నాగరాజు తెలిపారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని చెప్పారు.