Mahabubnagar | మహబూబ్‌నగర్, ఏప్రిల్ 16 : ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండ సంగతి అటుంచితే.. కడసారి చూపు చూసేందుకు కూడా రాని ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లికి చెందిన మాణిక్యరావు (80) సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా విధులు నిర్వహించాడు.
మాణిక్యరావు దంపతులకు కుమారుడు గిరీశ్తోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య గతంలోనే మరణించడంతో సొంతూరులో ఉన్న తనకున్న 15 ఎకరాల పొలం, రూ.60 లక్షలు కొడుక్కి ఇచ్చాడు. మహబూబ్‌నగర్ పద్మావతి కాలనీలోని ఇంటిని ఆర్థికంగా వెనుకబడిన తన పెద్ద కూతురు రాజనందిని పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడు. అనంతరం బిడ్డల సంరక్షణలో పాలమూరులోనే ఉంటున్నాడు.
అనారోగ్యానికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని గిరీశ్‌కు సోదరీమణలు తెలియజేయగా పాలమూరులోని ఇంటిని మీ పేరుపై చేసినందునే అంత్యక్రియలకు రానని చెప్పాడు. దీంతో వారు ఇంటిని సమానంగా పంచుకుందాం.. ముందు అంతిమయాత్రకు రావాలని వేడుకున్నారు. బంధుమిత్రులు నచ్చజెప్పినా రానంటూ తేల్చిచెప్పాడు. దీంతో పెద్దల సూచనమేరకు చిన్న కూతురు రఘునందిని తలకొరివి పెట్టారు. తండ్రిపై మమకారం కన్నా.. ఆస్తికే ప్రాధాన్యత ఇచ్చిన కొడుకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.