నీలగిరి, ఏప్రిల్ 28 : మద్యం మత్తులో తండ్రి చేసిన తప్పు.. ఆ కొడుకు పాలిట శాపంగా మారింది. మహిళపై లైంగిక దాడి జరిపి ఆపై హత్య చేసిన కేసులో తండ్రి జైలుకు వెళ్లగా… అవమా న భారంతో కొడుకు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా ముషంపల్లి గ్రామంలో చోటుచేసుకొన్నది. రూరల్ ఎస్సై గోపాల్రావు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం ముషంపల్లికి చెందిన బక్కతట్ల లింగయ్య, మరో వ్యక్తి కలిసి ఆరు నెలల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడి ఆపై హత్యచేశారు. ఈ కేసులో వారిద్దరిపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. కోర్టు తీర్పు ప్రకారం వారు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అప్పటి నుంచి లింగయ్య కుమారుడు కల్యాణ్ (18) మానసికంగా కుంగిపోతున్నాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైకప్పునకు చీరెతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.