కొడిమ్యాల, మే 10 : మదర్స్ డే రోజు ఓ తల్లికి అవమానం జరిగింది. 95 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా ఆమె కొడుకు పాత ఇంట్లో వదిలేసి వెళ్లాడు. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన వడ్లకొండ రాజవ్వ (95)కు నలుగురు కొడుకులు దేవరాజం, జనార్దన్, శ్రీను, రమేశ్‌తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరికీ వివాహాలు కాగా, భర్త నారాయణ కొన్ని రోజుల క్రితం మరణించాడు. రాజవ్వ-నారాయణ సంపాదించిన రూ.1.20 కోట్ల విలువైన ఖాళీ స్థలంతోపాటు నాలుగు ఇండ్లను 2025 ఫిబ్రవరిలో కొడుకులకు సమానంగా పంచింది.
కుల సంఘంలో పంపకాలు జరుగగా, నలుగురు కొడుకులు నెలకు ఒక్కరి చొప్పున తల్లిని సాకాలని నిర్ణయించుకున్నారు. దేవరాజం కోరుట్లలో, జనార్దన్ కరీంనగర్లో, శ్రీను, రమేశ్ ముంబైలో స్థిరపడ్డారు. రెండో కొడుకు జనార్దన్ వంతు పూర్తయి నాలుగు రోజులు గడిచింది. తల్లిని తీసుకెళ్లాల్సిన మరో కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆదివారం జనార్దన్ తన తల్లిని కొడిమ్యాలలోని పాత ఇంట్లో దింపేసి వెళ్లాడు. చట్టుపక్కల వారు చూసి రాజవ్వకు భోజనం, మంచినీళ్లు అందించారు. విషయం తెలుసుకున్న మీడియా రాజవ్వకు సంబంధించిన వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జనార్దన్ తల్లిని తీసుకొని వెళ్లినట్టు స్థానికులు తెలిపారు.