హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను తెలంగాణలోనే కొనసాగించాలని, ఇందుకు ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం ఉన్నప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర సర్వీస్ అధికారుల కేటాయింపుల్లో భాగంగా కేంద్రం సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించింది.
పలువురు కేంద్ర సర్వీస్ అధికారులను ఏపీకి కేటాయించడాన్ని తప్పుపడుతూ కేం ద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో వారంతా సవా ల్ చేశారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ సిఫార్సులు లోపభూయిష్టంగా ఉన్నాయనే వారి వాదనను క్యాట్ ఆ మోదించి కేటాయింపులను రద్దు చేసింది. క్యాట్ ఉత్తర్వులను కేంద్రం హైకోర్టులో సవాల్ చేసింది. వీటిపై గురువారం హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నందలతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు కొనసాగాయి. సీఎస్‌గా రాష్ట్ర పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఇకడే కొనసాగించాలని రాష్ట్రం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. అధికారుల కేటాయింపులపై రెండు రాష్ట్రాలకు అభ్యంతరం లేనప్పుడు కేంద్రం ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. విచారణను ధర్మాసనం ఈ నెల 20కి వాయిదా వేసింది.