Hanumakonda | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 27: హనుమకొండలోని పెద్దమ్మగడ్డ దళితుల సమాధులు మళ్లీ కబ్జా చేసేందుకు బుధవారం కొందరు యత్నించారు. సమాధుల చుట్టూ చదును చేసి కంచెను తొలిగించి ముళ్లకంపలను తగులబెట్టారు. మట్టెవాడ పోలీసుల సహకారంతోనే సమాధులు కబ్జాకు గురవుతున్నాయని దళితులు ఆరోపిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ అండదండలతోనే సమాధులను కబ్జా చేస్తున్నారని మండిపడుతున్నారు. సెప్టెంబర్ 20న కూడా కబ్జాదారులు, పోలీసుల సహకారంతో సమాధులను పట్టపగలే బుల్డోజర్తో కూల్చి వేసేందుకు యత్నించారు.
బాధిత కుటుంబసభ్యులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పెద్దమ్మగడ్డ జంక్షన్లో ఆందోళన చేశారు. హనుమకొండకు చెందిన మెల్గిబ్సన్ అనే యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడ్డాడు. చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝాను పెద్దమ్మగడ్డ దళిత పెద్దలు కలిసి విన్నవించి రెండు నెలలు గడవక ముందే మళ్లీ కబ్జాకు యత్నించడంపై స్థానికులు మండిపడుతున్నారు.