MLA Marri Rajashekar Reddy | హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై ప్రభుత్వం కూల్చివేతల అస్త్రం ప్రయోగించింది. ఆయనకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కళాశాల (ఐఏఆర్ఈ) భవనాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదామర చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో కళాశాల యాజమాన్యం అక్రమంగా నిర్మాణాలను చేపట్టిందనే ఆరోపణపై ఈ చర్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయమే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలతో అక్కడకు చేరుకున్న రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదలశాఖ అధికారులు బ్రేకర్లు, జేసీబీల సహాయంతో తొలుత ఒక భవనం గ్రౌండ్‌ఫ్లోర్ మొత్తం కూల్చివేశారు. అదే సమయంలో కళాశాల విద్యార్థులు ఒక్కసారిగా అక్కడకు దూసుకొచ్చి జేసీబీలకు అడ్డుగా నిలిచారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో అధికారులు కొద్దిసేపు కూల్చివేతలను నిలిపివేశారు. అనంతరం కళాశాల తరగతులకు సెలవు ప్రకటింపజేసి విద్యార్థులను అక్కడి నుంచి పంపించివేశారు. మరోవైపు అప్పటికే అక్కడికి కళాశాల యజమాని, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, బీ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్‌రాజు చేరుకున్నారు. అనంతరం గడువు కోరేందుకు అక్కడి నుంచి కలెక్టరేట్‌కు వెళ్లారు. ఇంతలో అధికారులు పోలీసుల బందోబస్తుతో భవనం రెండో అంతస్థును కూడా కూల్చివేశారు. కళాశాల యాజమాన్యం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతో దానిని పరిశీలించిన న్యాయమూర్తి తాత్కాలికంగా కూల్చివేతలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదుచేయించి బెదిరింపులకు దిగుతున్నదని విమర్శించారు. తాము అక్రమణలను సమర్థించడం లేదని, ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలని స్పష్టంచేశారు. సోమవారం వరకు కూల్చివేతలు చేపట్టొద్దని స్టాండింగ్ కమిటీ సూచించినప్పటికీ, ఆగమేఘాల మీద కూల్చివేతలు చేపట్టడమేమిటని ప్రశ్నించారు. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయం కనుసన్నల్లోనే జరుగుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడా అక్రమ నిర్మాణాలు చేపట్టలేదా? వాటిని ఎప్పుడు కూల్చుతారు? అని ప్రశ్నించారు.
కాలేజీ నిర్మాణాలకు అన్ని అనుమతులు పొందినప్పటికీ మున్సిపల్ అధికారులు కూల్చివేతలకు పాల్పడటం ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నామని మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. తాము ఎక్కడా ప్రభుత్వ భూములు ఆక్రమించలేదని చెప్పారు. 1995లో మొత్తం 50 ఎకరాలు కొనుగోలు చేసి అప్పటి గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. తిరిగి 2015లో హెచ్ఎండీఏ అనుమతుల కోసం రూ.95 లక్షలు ఫీజు చెల్లించి రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేశామని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నదని వివరించారు. వారం క్రితం తమకు నోటీసులు ఇవ్వగా దానికి సమాధానం ఇచ్చామని, అయితే మళ్లీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని చెప్పారు. తాము కలెక్టర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదని, మరోవైపు కూల్చివేతలను తీవ్రతరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసే ప్రయత్నం చేయగా, ఆయన అందుబాటులో లేరని, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిశామని తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అన్యాయంగా జరుగుతున్న కూల్చివేతలు ఆపాలని కోరామని చెప్పారు. విద్యాసంస్థ ఫౌండర్ చైర్మన్ హోదాలోనే తాము వేం నరేందర్‌రెడ్డిని కలిశామని, దీనిని రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు.