హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో లారీ యాజమానుల సంఘాల అసోసియేషన్ ముఖ్యనాయకులు కేటీఆర్‌ను కలిశారు. రాష్ట్రాల మధ్య కామన్ పర్మిట్‌తోపాటు ఓవర్‌లోడ్ జరిమానాలు, గ్రీన్‌ట్యాక్స్ వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో మాట్లాడారు. లారీ యజమానుల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని సూచించారు.
సీఎం కేసీఆర్‌ను బలపరుస్తాం : రాజేందర్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న తమ సంఘం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని లారీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ను బలపరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. తమ సమస్యల పరిషారంపట్ల మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటున్నామని వెల్లడించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో రాజేందర్‌రెడ్డితో పాటు చాంద్‌పాషా, సలీం, రాంరెడ్డి, బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పీ. నందారెడ్డి, ఉపాధ్యక్షుడు సర్వీ యాదయ్య గౌడ్, లింగ స్వామి, లింగన్న గౌడ్ తదితరులు ఉన్నారు.