హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు, నాటి డైరెక్టర్ల నుంచి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ టెక్ మహీంద్ర దాఖలు చేసిన కేసును ఆరు నెలల్లోగా పరిషరించాలని సిటీ సివిల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. సత్యం సంక్షోభం తర్వాత టెక్ మహీంద్రగా మారింది. సత్యం రామలింగరాజు ఇతరులను కింది కోర్టు దోషులుగా తేల్చిందని, పదేండ్లుగా సిటీ సివిల్ కోర్టులోని తమ కేసు కొలికి రావడం లేదని టెక్ మహీంద్ర తరఫు సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదించారు. వాదనల తర్వాత కింది కోర్టు ఆరు నెలల్లోగా పిటిషనర్ల కేసును పరిషరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.