బోధన్, అక్టోబర్ 5: సిక్కిం రాష్ట్రంలోని తీస్తా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలో 23 మంది భారత జవాన్లు, సైనిక అధికారులు బుధవారం కొట్టుకుపోయారు. వారిలో ఒకరైన నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం కుమ్మన్‌పల్లికి చెందిన ఆర్మీ జవాన్ లాన్స్‌నాయక్ నీరడి గంగాప్రసాద్ (27) మృతిచెందారు. ఆయన భౌతికకాయం గురువారం లభ్యమైంది. గంగాప్రసాద్ మృతితో కుమ్మన్పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గంగాప్రసాద్ భార్య శిరీషతో కలిసి పశ్చిమబెంగాల్ సరిహద్దులో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. గంగాప్రసాద్ గల్లంతు వార్తను సైనిక అధికారుల ద్వారా తెలుసుకున్న ఆయన తమ్ముడు సాయిసుధాకర్, మరో కజిన్ దిలీప్ సంఘటనా స్థలానికి బుధవారం రాత్రి విమానంలో బయలుదేరి వెళ్లారు. అక్కడ గంగాప్రసాద్ భార్య శిరీషను కలుసుకున్న అనంతరం.. వారిని సైనిక అధికారులు గంగాప్రసాద్ భౌతికకాయం లభ్యమైన చోటుకు తీసుకెళ్లి చూపించారు. గంగాప్రసాద్ భౌతికకాయాన్ని శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం కుమ్మన్‌పల్లికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కుమ్మన్పల్లిలో గంగాప్రసాద్ భౌతికకాయానికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ గంగాప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.