గూడూరు, మే 12: జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్‌గా విధులు నిర్వర్తిస్తున్న మహబూబాబాద్ జిల్లాకు చెందిన బొమ్మగాని శ్రీనివాస్ (37) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ పంచాయతీకి చెందిన బొమ్మగాని శ్రీనివాస్ సీఆర్పీఎఫ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
వృత్తిరీత్యా జమ్మాకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో లాస్జన్ బైపాస్‌లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో సోమవారం రాత్రి ఇర్షాద్ నబీబట్ అనే వ్యక్తి నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంతో వేగంగా వచ్చి ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనగర్ నుంచి ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలించారు. ఈ ఘటనతో సీతానగరంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య సౌజన్య, కూతురు వీక్షిత, కుమారుడు ధనుష్ ఉన్నారు.