హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ) వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో సౌర విద్యుత్తు వ్యవస్థ (సోలార్ యూనిట్)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ వెల్లడించారు. తొలి విడతగా 26 గోదాముల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ అంశంపై శుక్రవారం ఆయన ఎర్రమంజిల్‌లోని తన కార్యాలయంలో రెడో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ అధ్యక్షుడు బుర్ర అశోక్కుమార్గౌడ్తో సమావేశమయ్యారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు సంస్థ చెల్లిస్తున్న విద్యుత్తు చార్జీలను గణనీయంగా తగ్గించుకునేందుకు సోలార్ యూనిట్ల ఏర్పాటే ఉత్తమ మార్గమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రవీందర్‌సింగ్ తెలిపారు.
పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై త్వరలో టీఎస్ రెడోతో అవగాహన కుదుర్చుకుంటామని చెప్పారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ భాసర్, డిప్యూటీ ఇంజనీర్ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అధికారుల బృందంతో కలిసి రవీందర్‌సింగ్ హైదరాబాద్‌లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని (సీఆర్వో) సందర్శించారు. అక్కడ సోలార్ సిస్టం ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.