హైదరాబాద్ జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ‘కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేస్తాం. ఇందిరా మహిళాశక్తి కింద సమైక్య సంఘాలకు సోలార్ ప్లాంట్లను కేటాయించి అక్టోబర్ 2లోగా ప్రారంభిస్తాం. ఇప్పటికే ఇన్స్టలేషన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పదే పదే ఆర్భాటపు ప్రకటనలు గుప్పిసున్నారు. కానీ ఆచరణలో ఈ దిశగా అడుగు ముందుకు పడిందిలేదు. కేటాయింపుపై స్పష్టత వచ్చిందీలేదు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నుంచి ఊదరగొడుతున్నా ఇందుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు నేటికీ విడుదల కాలేదు. సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు సవాలక్ష అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆ దిశగా కనీస చర్యలు చేపట్టలేదని పెదవి విరుస్తున్నారు.
ఒక్క మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు నాలుగు నుంచి ఐదెకరాల స్థలం అవసరమని నిపుణులు చెప్తున్నారు. ప్లాంట్ల స్థాపనకు అవసరమైతే స్థలాలను లీజుకు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు. గత పదేండ్లుగా సాగువిస్తీర్ణం పెరుగుతుండటంతో ఖాళీ స్థలాలు కనిపించడమే లేదు. ఒకవేళ ఉన్నా భారీగా ధరలు పలుకుతున్నాయి. లీజుకు ఇచ్చేందుకు రైతులు, యాజమానులు ముందుకొచ్చే పరిస్థితులులేవు. మరీ ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో భూములను సేకరించడం అసాధ్యమని భావిస్తున్నారు. ఒకవేళ స్థలాలు అందుబాటులో ఉన్నా సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుగుణంగా భూములను అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందా? లేదా ఇన్స్టలేషన్ కంపెనీలు భరిస్తాయా? అనే విషయంలో స్పష్టతలేదని పేర్కొంటున్నారు.
ఒక్క మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సుమారు రూ.3 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చులను భరించే విషయంలో అధికారులు స్పష్టమైన సమాధానాలు చెప్పడమే లేదు. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్తున్నారు కానీ ఇందుకు బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చేది ప్రభుత్వమా? ఇన్స్టలేషన్ కంపెనీలా? అనే విషయంలోనూ క్లారిటీ లేదు. అలాగే ప్లాంట్ నుంచి గ్రిడ్లకు ట్రాన్స్మిషన్ లైన్లు వేసే విషయంలోనూ సవాలక్ష ఇబ్బందులు ఉన్నాయి. ఒక్కో కిలోమీటర్ ట్రాన్స్మిషన్ లైన్‌కు రూ.15 లక్షల ఖర్చవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఖర్చులను డిస్కంలు భరిస్తాయా? ప్రభుత్వమే కేటాయిస్తుందా? గ్రామైక్య సంఘాలు పెట్టుకోవాల్సి ఉంటుందా? అనే విషయంలోనూ స్పష్టత కరువైంది.
ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించే విషయంలోనూ సర్కారుకు స్పష్టత కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామైక్య సంఘాలకా? మండల సమాఖ్యలకు ఇస్తారా? లేదంటే జిల్లా సమాఖ్యలకు అప్పగిస్తారా? అనే విషయంలోనూ సందిగ్ధత నెలకొన్నది. ఏ ప్రాతిపదికన నిర్వాహకులను ఎంపిక చేస్తారో తెలియడమే లేదు. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ద్వారా నెలకు రూ.1.40 లక్షల వాట్ల సోలార్ కరెంట్ ఉత్పత్తి అవుతుందని నిపుణులు చెప్తున్నారు. వాట్‌కు రూ.3.13 చొప్పున విక్రయించడం ద్వారా రూ.4.5 లక్షల ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. ఇందులో నిర్వహణకు రూ.53 వేల దాకా వెచ్చించాల్సి ఉంటుందని చెప్తున్నారు. మిగతా సుమారు రూ.4 లక్షల నగదు రూ.3 కోట్ల రుణం వడీకే సరిపోతుందని, అదికూడా 20 ఏండ్లు సుదీర్ఘకాలం బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణ ఏవిధంగా ఆచరణ సాధ్యమని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు కూడా ముందుకురావడం అనుమానమేనని పేర్కొంటున్నారు.