హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు పంట ఉత్పత్తులకు మాత్ర మే పరిమితమైన వ్యవసాయ భూముల్లో ము న్ముందు రైతులు విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసి రెండు విధాలా రాబడి పొందే రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలామంది రైతులు తమ పొలాల్లో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసి వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకొంటున్న విషయం తెలిసిందే. కానీ, అందుకు అవసరమైన సోలార్ ప్యానళ్లను (సౌర ఫలకలను) భూమికి తక్కువ ఎత్తులో ఏర్పాటు చేస్తుండటంతో ఆ మేరకు సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ఎక్కువ ఎత్తులో సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నారు.
తద్వారా ఆ భూమిని కూడా సాగుకు ఉపయోగించనున్నారు. ఇందుకోసం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ యూనివర్సిటీలోని సీడ్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారంచుట్టారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన అగ్రిఫొటో వోల్టాయిక్ సిస్టమ్‌ను వర్సిటీ అధికారులు బుధవారం ప్రారంభించారు. ఈ స్థలంలో యాసంగి సీజన్లో క్యారెట్, ఆకుకూరలను సాగు చేయాలని నిర్ణయించారు. సోలార్ ప్యానళ్ల కింద పండించే పంటల్లో ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉన్నదని అంచనా.ఈ ప్రయోగం విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కల్పించనున్నారు. తద్వారా రైతులకు రెండు విధాలుగా ఆదాయం లభించి ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.