హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): పాత 5 రూపాయల కాయిన్ అమ్మబోయి రూ.5 లక్షలు పోగొట్టుకొన్నాడో సాఫ్ట్వేర్ ఉద్యోగి. కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన దగ్గర ఉన్న ఐదు రుపాయల 10 కాయిన్లను క్వికర్.కామ్‌లో అప్లోడ్ చేశాడు. ఆసక్తి ఉన్నవారుంటే సంప్రదించాలని తన ఫోన్ నెంబర్‌ను జతచేశాడు. కాసేపటికే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తన పేరు హంటర్ జాన్ అని, తాను అమెరికా నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకొన్నాడు. తాను ఆ కాయిన్లను కొంటానని ఓ ధరకు ఒప్పందం చేసుకొన్నాడు. డబ్బు పూర్తిగా చెల్లించాకే కాయిన్లను పంపాలని చెప్పాడు. అయితే, డబ్బు పంపాలంటే ఈ వ్యాలెట్ ఖాతా ఉండాలని సూచించాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి నెట్టెలర్లో ఈ వ్యాలెట్ ఖాతాను తెరిచాడు. ఆ వివరాలను హంటర్ జాన్‌కు పంపాడు. తాను డబ్బు వేసినప్పుడల్లా డిపాజిట్ అని క్లిక్ చేయాలని జాన్ సూచించాడు. చెప్పినట్టు చేయటంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఖాతా నుంచి మొత్తం రూ.5.09 లక్షలు ఖాళీ అయ్యాయి. చివరికి మోసపోయానని గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.