హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ అంతమే.. మా పంతం అంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు. నో పీఆర్సీ.. నో ఓటు.. అంటూ కొత్త పల్లవిని అందుకున్నాయి. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరుతామని ఏకంగా హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున పోస్టులు వెలుస్తున్నాయి. రాష్ట్రంలో 15 లక్షల వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి. మెజారిటీ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు పట్టణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటారు. వీరికి నగరాలు, పట్టణాల్లోనే ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బుద్ధి చెప్తామని టీచర్లు, ఉద్యోగులు ఎక్కడికక్కడ ప్రతినబూనుతున్నారు. రెండున్నరేండ్లుగా పీఆర్సీ ఊసేలేదని ధ్వజమెత్తుతున్నాయి. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకరోజు మాత్రమే సమయం ఉన్నది. డీఏలు బాకీపడటం, రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించకపోవడం, హెల్త్‌కార్డులు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు తాము ఓట్లు వేయబోమని ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు తేల్చి చెప్తున్నాయి.
తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది, 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలోనే గత కేసీఆర్ సర్కారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలో పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. అంతలోనే ఎన్నికలొచ్చాయి. సర్కార్ మారింది. కాంగ్రెస్ కొలువుదీరింది. 2026 జూలై 1 వస్తే పాత పీఆర్సీ గడువు పూర్తయి మూడేండ్లు అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు రూపాయి కూడా పెరుగలేదు.
పీఆర్సీ కమిషన్ తన నివేదికను ఎప్పుడో సిద్ధం చేసింది. కబురు పంపితే సచివాలయానికి వచ్చి, ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నది. కానీ, కాంగ్రెస్ సరార్ ఆ నివేదికను స్వీకరించేందుకు జంకుతున్నది. కమిషన్ సిఫారసులు అందుకున్న మరుక్షణం నుంచే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుందని పాలకులు ధైర్యం చేయడం లేదు. అటు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక, ఇటు పీఆర్సీ అమలు నుంచి తప్పించుకొనే అవకాశం లేక ఇరుకున పడుతామన్న భయంతోనే పీఆర్సీ సభ్యులకు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదనన్నది సర్కార్‌పై ప్రధాన అభియోగం. రెండేండ్లుగా కండ్లు కా యలు కాచేలా ఎదురుచూస్తున్నా.. పాలకులు కిమ్మనడం లేదన్న అసహనం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది.
నివేదికను రూపొందించే క్రమంలో పీఆర్సీ అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. కొన్ని సంఘాలు 50%, మరికొన్ని 51% ఫిట్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్లను పీఆర్సీ కమిటీ ముందుంచాయి. 50శాతం ఫిట్మెంట్ పెంచితే ఖజానాపై రూ.12,750 కోట్ల భారం పడుతుంది. కనీసం 1% ఫిట్మెంట్ లెకగట్టినా నెలకు తకువలో తకువగా రూ.250 నుంచి రూ.300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 20% ప్రకటిస్తే రూ.5 వేల కోట్లు, 30% అయితే, రూ.7,500 కోట్ల భారం తప్పదు. రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా రూపాయి ఇవ్వలేదు. రిటైర్డ్ అయిన వారైతే ఇండ్ల ముందు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇక పీఆర్సీ ఇవ్వకపోవడంపై ఉద్యోగు లు, ఉపాధ్యాయులు సోషల్‌మీడియాలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఉద్యోగ విరమణ చేసి దాదాపు రెండేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుర్ర సుధాకర్ ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు అడిగే హక్కు లేదంటూ’ తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని ఏర్పాటుచేసి వినూత్న నిరసన తెలిపారు. ఉద్యోగులపై కక్ష కట్టిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ప్లెక్సీ కట్టినట్టు తెలిపారు. -కరీంనగర్ కార్పొరేషన్