హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం అమలు చేయాలని, తద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్ కోరింది. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు పుట్టా పద్మారావు, ప్రధాన కార్యదర్శి టీవీ రమేశ్ శుక్రవారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించారు. అనేక దశాబ్దాలుగా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం సక్రమంగా అమలు కావడం లేదని, హైకోర్టు బార్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల న్యాయవాదులకు న్యాయమూర్తుల నియామకాల్లో తగిన అవకాశాలు దకడం లేదని ఆ వినతిపత్రంలో పేరొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 39తోపాటు రాష్ట్ర విధాన నిర్దేశిక సూత్రాలు అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని గుర్తుచేస్తూ.. న్యాయవ్యవస్థలో సమాన ప్రాతినిధ్యం ఉన్నదనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని కోరారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి జరుగుతున్న ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన అనుభవజ్ఞులైన న్యాయవాదుల పేర్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.