Smitha Sabharwal | హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/బొడ్రాయిబజార్/వీణవంక/ మహబూబాబాద్ రూరల్ : ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రా రంభమైన ఈ వివాదం క్రమంగా విస్తరిస్తున్నది. ఐఏఎస్‌కు రాజీనామా చేసి తనతోపాటు సివిల్స్ పరీక్ష రాయాలని, తనకంటే ఎక్కువ మార్కులు సాధించాలని సివిల్స్ ట్రైనర్ బాలలత విసిరిన సవాల్‌ను స్మితా సబర్వాల్ స్వీకరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం పోస్టు చేశా రు. ‘నేను ఆమె విచిత్రమైన సవాల్‌ను స్వీకరిస్తున్నా. యూపీఎస్సీ నా పెరిగిన వయసును పరిగణలోకి తీసుకుంటుందా? అనేది సందేహంగా ఉంది.
దివ్యాంగుల కోటాలో ఆమె తన ప్రత్యేక హకును దేనికి ఉపయోగించింది? కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నడపడానికా? లేదా ప్రజలకు సేవ చేయడానికా? జస్ట్ ఆస్కింగ్’ అంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ అభిప్రాయం తో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తుండగా.. ఇది మంచి పద్ధతికాదని కొందరు వారిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ మాత్రం ‘మేడమ్ మా ఫుల్ సపోర్టు మీకే’ అం టూ కామెంట్లు పెడుతున్నా రు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఎంపీ ప్రియాంక చతుర్వేది సైతం అభ్యంతరం వ్యక్తంచేశారు. చాలా వైకల్యా లు సామర్థ్యంపై ప్రభావం చూపవు’ అని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కరుణ వ్యాఖ్యానించారు.
సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోటాపై చెలరేగుతున్న దుమారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. ‘స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. సోష ల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఏం సంబంధం’? అని ప్రశ్నించారు.
స్మితా సబర్వాల్ ఉన్నతాధికారిగా ఉండి ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్పందించడం తప్పని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఫీల్డ్ విజిట్ చేసే ఉద్యోగానికి, ఆఫీస్‌లో చేసే ఉ ద్యోగానికి తేడా ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆమె సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులైన ఎంతో మంది ఐఏఎస్‌లు ఉన్నత పదవులు అలంకరించారని గుర్తుచేశారు. స్మితా సబర్వాల్ వాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లే ఉంటాయని, తాను కూడా సీఎంతో మాట్లాడుతానని తెలిపారు. స్మితా సబర్వాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
దివ్యాంగులను కించపరిచేలా వ్యా ఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఏపీ వికలాంగుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బకా జడ్సన్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో స్మితపై దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వికలాంగుల హకుల రక్షణ పోరాట సమితి నాయకుడు జంగయ్య డీజీపీ జితేందర్‌ను కోరారు.
మంగళవారం సూర్యాపేట పాత బస్టాండ్ వద్ద దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. స్మితపై కేసు నమోదు చేయాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య ఆధ్వర్యం లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి స్పందిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ఓ అధికారి దివ్యాంగులను కించపరచడం సరికాదని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, రామన్నపేటలోనూ దివ్యాంగులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.