Smita Sabharwal | తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మిషన్ భగీరథ ఇంజినీర్లు, అధికారులను ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండుగ కోసం ఏర్పాట్లు ఘనంగా చేయాలన్నారు. మంగళవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈలతో ఉత్సవాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. జూన్ 18 నాడు మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాలు, గ్రామాల్లో వేడుకలు నిర్వహించాలన్నారు. నాడు మంచినీళ్ల కోసం పడ్డ కష్టాలను, నేడు మిషన్ భగీరథతో అవుతున్న తాగునీటి సరాఫరాను గ్రామస్తులకు వివరించాలన్నారు.
గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మీడియా ప్రతినిధులను వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు తీసుకుపోయి నీటి శుద్ధి ప్రక్రియను చూపించాలన్నారు. సంబరాల్లో గ్రామస్తులతా పాల్గొనేలా చూడాలన్నారు. ఇక జూన్13 వ తేదిన నిర్వహించే మహిళా సంక్షేమ దినోత్సవం సంబరాల్లో మిషన్ భగీరథ మహిళా ఇంజనీర్లు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. భగీరథ ప్రధాన కార్యాలయంతో పాటు ఎస్ఈ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా సాంసృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించాలన్నారు. సమావేశంలో ఈఎస్సీ కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు జ్ఞానేశ్వర్‌తో పాటు చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈలు పాల్గొన్నారు.