హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై ఏఐ ఫొటో రీట్వీట్ చేశారన్న కేసులో గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన నోటీసుకు సీనియర్ ఐఏఎస్ అధికారి, పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు. ఈ మేరకు శనివారం స్మితా సబర్వాల్ ఆఫీస్‌కు వెళ్లిన గచ్చిబౌలి పోలీసులు ఆమె స్టేట్మెంట్ను తీసుకున్నారు. మార్చి 31న ‘హాయ్ హైదరాబాద్’ అనే ఎక్స్ హ్యాండిల్ పోస్టును రీషేర్ చేయడానికి సంబంధించిన వివరణను రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత స్మితాసబర్వాల్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. చట్టం పరిధిలో పోలీసులకు పూర్తిగా సహకరించినట్టు పేర్కొన్నారు. చట్టానికి కట్టుబడే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులను కొన్ని ప్రశ్నలు అడిగినట్టు చెప్పారు. ఆ పోస్టును 2 వేల మంది రీషేర్ చేశారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్యలే తీసుకుంటున్నారా? అనే స్పష్టత కోరాను. అలా కాకపోతే ఎంపిక చేసిన కొంతమందినే లక్ష్యంగా చేసుకున్నట్టు అనుకోవాల్సి వస్తుంది. ఒకవేళ అలా జరిగినట్టయితే చట్టం ముందు అందరూ సమానమే అనే సహజన్యాయ సూత్రానికి రాజీపడినట్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. తన ట్వీట్లో #RuleofLaw #Freedo mOfSpeech #justsaying అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చారు.