Smart Meters | హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వ్యవసాయానికి ఇక నుంచి విద్యుత్తు ఎంత మొత్తంలో సరఫరా అవుతుందో నిర్ధారించనున్నారు. స్మార్ట్‌మీటర్ల ద్వారా లెక్కలు తేల్చనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని సాగు రంగానికి వినియోగించే విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు రాష్ట్ర సర్కార్ స్మార్ట్‌మీటర్లను బిగించనున్నది. రైతు డిస్కమ్ ఏర్పాటుపై శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈఆర్సీ బహిరంగ విచారణలో సర్కార్ ఇదే విషయా న్ని బహిర్గతం చేసింది.
రాష్ట్రంలో 5.22 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వీటన్నింటికీ స్మార్ట్‌మీటర్లను బిగిస్తారు. వీటి బిగింపు కోసం మొత్తంగా రూ.1,306 కోట్లు ఖర్చు కానున్నది. వ్యవసాయ వినియోగదారులు కేంద్రంగా ఈ మీటర్లు బిగించబోమని, ఎనర్జీ ఆడిటింగ్ కోసమే వీటిని బిగించనున్నామని రైతు డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూకీ ఈ సందర్భంగా వివరించారు. మీటర్ల బిగింపు, కొత్త డిస్కమ్ ఏర్పాటుతో విద్యుత్తు వ్యయం, నష్టాలను గుర్తించే అవకాశం ఉంటుందని, సాంకేతిక, కమర్షియల్ నష్టాలను తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ స్కీమ్‌లో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దీని వెనుక ఆంతర్యం కూడా మీటర్లు బిగించడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల బిగింపును అదానీ కంపెనీకి అప్పగించే అవకాశం ఉన్నదన్న ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే సర్కార్ దీనిపై ఓ నిర్ణయం తీసుకొన్నదని తెలుస్తున్నది. ఈ కంపెనీకే టెండర్లు దక్కేలా నిబంధనలు పొందుపరుస్తున్నారని, మీటర్ల బిగింపును అప్పగించడం ఇక లాంఛనమేనని సమాచారం.
దేశంలో స్మార్ట్‌మీటర్ల తయారీ, బిగింపులో ఈ కంపెనీది అందెవేసిన చెయ్యి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీకి దేశంలో అతి పెద్ద ప్రైవేట్ మీటర్స్ సర్వీస్ ప్రొవైడర్‌గా పేరున్నది. ఇప్పటికే ఈ సంస్థ కోటికి పైగా మీటర్లను అమర్చినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ఇతర కంపెనీల మీటర్లను ఈ సంస్థ తన పేరిట బిగించిన దాఖలాలూ ఉన్నాయని విద్యుత్తురంగ నిపుణలు చెప్తున్నారు. ఒక్కో స్మార్ట్‌మీటర్ విలువ రూ.25 వేలు ఉంటుంది. ఉత్తర డిస్కమ్ పరిధిలోని 2.30 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు రూ.576 కోట్లు, దక్షిణ డిస్కమ్ పరిధిలోని 2.92 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు రూ.730 కోట్ల చొప్పున మొత్తంగా రూ.1,306 కోట్లను ఈ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుకు వెచ్చించనున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి వినియోగదారులపైనే ఏదో ఒక రూపంలో రుద్దనున్నారని విద్యుత్తురంగ నిపుణులు అంటున్నారు.
