హైదరాబాద్, సుల్తాన్‌బజార్ జూన్ 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ ఎన్నికయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముజీబ్ ప్రస్తుతం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గతంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రచార కార్యదర్శిగా, నాలుగు పర్యాయాలు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. సకలజనుల సమ్మె విజయవంతం కావడంలో ఆయన కీలకపాత్రను పోషించారు.
సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలోను ముజీబ్ ముందంజలో ఉంటారు. ఎంఎన్‌జే, బసవతారకం క్యాన్సర్ దవాఖానల్లో నిర్విరామంగా అన్నదానాన్ని నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహించడమే కాకుండా ఎంతో మంది అనాథలకు అండగా ఉన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయన సేవలను గుర్తించిన టీన్జీవో కేంద్ర కార్యవర్గం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నది. ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్, ముత్యాల సత్యనారాయణగౌడ్ కోశాధికారి రామినేని శ్రీనివాస్‌రావు, కొండల్‌రెడ్డి, పలు జిల్లాల అధ్యక్షప్రధాన కార్యదర్శులు ముజీబ్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం గన్‌పార్క్ వరకు ర్యాలీగా వెళ్లి, అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్రం సంఘం ఉపాధ్యక్షుడిగా పర్వతాలు, కార్యదర్శులుగా రాగి శ్రీనివాస్, జ్ఞానేశ్వర్‌సింగ్, గూడ ప్రభాకర్, షఫీ అహ్మద్, కార్యవర్గ సభ్యురాలిగా గీతారాణిలకు నియామకపత్రాలు అందజేశారు.
ఉద్యోగుల అనేక సమస్యలు ఇంకా ఆపరిష్కృతంగానే ఉన్నాయని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ తెలిపారు. ఉద్యోగుల బిల్లులు సహా నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. నూతన జిల్లాలకు అనుగుణంగా క్యాడర్ స్ట్రెంత్ పెంచడం, ఈహెచ్ఎస్ స్కీం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు, టీఎన్జీవో సంఘానికి స్థలాల కేటాయింపు, పీఆర్సీ నివేదికను త్వరగా అందజేసి, మెరుగైన ఫిట్మెంట్, వంటి అంశాలపై తీర్మానాలు చేశామని వివరించారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చిన 144 మందిని విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి మన్ననలు పొందాలని విజ్ఞప్తి చేశారు.
టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలోని ఉద్యోగుల సేవలో తరిస్తానని, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ముజీబ్ హుస్సేని స్పష్టంచేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కార సభలను నిర్వహిస్తామని చెప్పారు. టీఎన్జీవో సొసైటీలోని 4,012 మంది సభ్యులకు ఇండ్లస్థలాలను కేటాయించాలని, ఉద్యోగుల బదిలీల్లో సీనియర్లకు ప్రధాన్యం ఇవ్వాలని, జీవో -317 సమస్యలను పరిష్కరించాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని, హెల్త్‌కార్డులను మంజూరుచేయాలని ముజీబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.