పెన్పహాడ్ /గరిడేపల్లి, జనవరి 27 : యూరియా కోసం రైతులు బారులుదీరుతున్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో క్యూలైన్లో చెప్పులు పెట్టి ఎదురుచూసిన ఘటనలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం అనంతారంలోనూ సోమవారం అలాగే జరిగింది. కొద్దిరోజులుగా యూరియా కొరత ఉండగా అనంతారం (నారాయణగూడెం) పీఏసీఎస్ కార్యాలయానికి యూరి యా లారీ వచ్చిందని తెలవడంతో రైతులు ఆదివారం రాత్రి నుంచే పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన పొట్లపహాడ్, అనంతారం, అనాజిపురం, మహ్మదాపురం, దోసపహాడ్ గ్రామాలకు చెందిన సుమారు 200 మందికిపైగా రైతులు నిలబడే ఓపిక లేక చెప్పులను క్యూలైన్లో పెట్టారు. పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ యూరియా కొరత రాలేదని, ఇలా ఎప్పుడూ అవస్థలు పడలేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ రైతులకు సాగునీరు, ఎరువులు, విత్తనాలు, కరెంట్ సరిపడా అందించారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎరువుల కోసం గంటల తరబడి పడిగాపుల కాయాల్సిన దుస్థితి వచ్చిందని, పొద్దునే వస్తే మధ్యాహ్నం వరకు కూడా సిబ్బంది రాకపోవడంతో తలుపులు తెరుచుకోలేదని రైతులు అసహనానికి గురయ్యారు. అధికారులు స్పందించి సరిపడా ఎరువులు అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంలో పీఏసీఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున లైన్లలో నిలబడ్డారు. గ్రామానికి చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు సోమవారం ఉదయాన్నే క్యూలో నిలబడ్డారు. వీరిలో వృద్ధులు, మహిళలు కూడా ఉన్నారు. కాంగ్రెస్ పాలనలో గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు రైతులు ఆవేదన వ్యకం చేశారు.