ములుగు: రాష్ట్రంలో యూరియా (Urea) కోసం రైతుల తిప్పలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని క్యూలైన్లలో పడరానిపాట్లు పడుతున్నారు. ఎరువులు వచ్చాయని తెలిస్తే చాలు పెద్ద సంఖ్యలో అన్నదాతలు సహకార సంఘాలు, ఆగ్రో కేంద్రాలకు తరలిసవస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు, కట్టెలు, రాళ్లు పెట్టి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రాపురంలో యూరియా కోసం రైతులు తమ చెప్పులతో పాటు ఖాళీ మద్యం సీసాలను క్యూ లైన్లో ఉంచారు.
రాష్ట్రంలో యూరియా కొరత రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు తమ ప్రాణాలు కోల్పోతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు ప్రాణం పోయాల్సిన యూరియా.. కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతుల ప్రాణాలు బలిగొంటున్నది. మరికొన్నిచోట్ల యూరియా కోసం జరిగిన తోపులాటల్లో రైతుల కాళ్లు, చేతులు విరిగిపోతున్నాయి. తలలు పగులుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, యూరియా కొరత పచ్చని పల్లెల్లో చిచ్చు రేపుతున్నది. అన్నదమ్ముల్లాంటి రైతుల మధ్య అగ్గిరాజేస్తున్నది. ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే రైతులు యూరియా కోసం తన్నుకొనే పరిస్థితి ఏర్పడింది.
యూరియా కొరత కుటుంబాల్లోనూ చిచ్చు పెడుతున్నది. భార్యభర్తలు, తండ్రీ కొడుకుల మధ్య గొడవలకు కారణమవుతున్నది. ఇప్పటివరకు మీడియా సమాచారం మేరకు ఐదుగురు రైతులు యూరియా కొరత కారణంగా మరణించారు. ఈ సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చని భా విస్తున్నారు. యూరియా కోసం వెళ్తూ రోడ్డు ప్ర మాదంలో మరణించిన వారు కొందరైతే.. యూ రియా పెట్టిన చిచ్చు కారణంగా తలెత్తిన గొడవల్లో మరణించిన వారు మరికొందరు. క్యూలైన్లలో నిల్చోలేక కొంతమంది రైతులు సొమ్మసిల్లి పడిపోతుంటే.. క్యూలైన్లలో జరిగిన తోపులాటల్లో మరికొందరు రైతులు గాయపడ్డారు.