హైదరాబాద్/మహబూబ్‌నగర్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనులపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. ఆ పనులను చేస్తున్నామంటూ జోరుగా హడావుడి చేస్తున్నది. కానీ, సొరంగ మార్గానికి సంబంధించి ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్) అధ్యయనం నివేదిక రాకముందే, సమగ్ర సాంకేతిక అధ్యయనం లేకుండానే పనులు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ ప్రకటనల్లో పునరుద్ధరణ పనుల బడ్జెట్ తదితర అంశాలపై కూడా స్పష్టత కొరవడింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనాలు, నిర్దిష్ట ప్రణాళిక లేకుండానే కాంగ్రెస్ సర్కార్ హడావుడిగా ఎస్ఎల్బీసీ పనులను మొదలుపెట్టడంతో సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇద్దరు కార్మికుల మృతదేహాలను వెలికితీయగా మిగతా ఆరుగురి మృతదేహాల జాడ తెలియలేదు.
ఈ ప్రమాదంలో టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) పూర్తిగా ధ్వంసమైంది. దీంతో టీబీఎం పద్ధతికే స్వస్తి పలికినట్టు వెల్లడించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి పనులను పునఃప్రారంభించినట్టు ఇటీవలే ప్రకటించింది. టీబీఎం బదులుగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లో గత నెల 17న ఇన్లెట్, అవుట్లెట్ నుంచి టన్నెల్ పనులను ప్రారంభించామని, 2028 జూన్ నాటికి ఈ పనులను పూర్తిచేస్తామని పదేపదే చెప్తున్నది. ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక లేకుండానే ముందుకుసాగుతున్నదని ఇంజినీర్లు మండిపడుతున్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన, ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత 12 మందితో ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయడంతో పనుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి, సిఫారసులు చేసేందుకు ఆ కమిటీ సాంకేతిక నిపుణులతో మరో సబ్‌కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఎస్ఎల్బీసీ ప్రస్తుత పరిస్థితులు, తదుపరి చర్యలపై ఆ సబ్‌కమిటీ అధ్యయనం చేసింది.
సొరంగంపై 30 మీటర్ల ఎగువ వరకు, ఇరువైపులా 20 మీటర్ల వరకు భూభౌతిక పరీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, టన్నెల్ స్పెషలిస్ట్ కల్నల్ పరీక్షిత్ పర్యవేక్షణలో ఎన్జీఆర్ఐ నేతృత్వంలో ఇటీవల హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే నిర్వహించి, భూమికి అడుగున 1,000 మీటర్ల లోతు వరకు ఉన్న జియోలాజికల్ కండిషన్ డాటాను సేకరించింది. అనంతరం ఆ సర్వే నివేదిక అందినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, అది తమ చేతికే రాలేదని, ఎన్జీఆర్ఐ ప్రాథమిక నివేదికను మాత్రమే అందించిందని, పూర్తిస్థాయి నివేదిక ఇంకా రాలేదని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. కాగా, ఆ ప్రాథమిక నివేదికను కూడా ఇరిగేషన్ అధికారులకు, సంబంధిత ప్రాజెక్టు అధికారులకు సమర్పించకుండా నేరుగా ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుకు, టన్నెల్ ఎక్స్‌పర్ట్‌కు సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాథమిక నివేదికలో ఏమున్నదో ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతం చేయకుండా గోప్యత పాటిస్తున్నది.
పనులపై అనేక అనుమానాలు
టన్నెల్ పనులపై ఇంజినీర్లు సైతం అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్లెట్ టన్నెల్లో 13.95 కి.మీ. వద్ద ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ వైపు నుంచీ పనులను కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదం సంభవించిన చోటు నుంచి దాదాపు 70 మీటర్ల వెనుక ఎడమ వైపు నుంచి టన్నెల్‌ను డైవర్ట్ చేసి, మళ్లీ సమాంతరంగా టన్నెల్ తవ్వకం చేపట్టినట్టు అధికారులు చెప్తున్నారు. కానీ, టన్నెల్‌ను డైవర్ట్ చేయడం వల్ల నీటి ప్రవాహంలో అవాంతరాలు ఏర్పడుతాయని, దీంతో నిర్దేశిత సామర్థ్యం మేరకు నీటిని తరలించడం సాధ్యం కాదని ఇరిగేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డీబీఎం పద్ధతి వల్ల ఇప్పటికే నిర్మాణం పూర్తయిన టన్నెల్ మార్గం సైతం ప్రభావితమవుతుందని చెప్తున్నారు. దీన్ని నిరోధించేందుకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారో? ఎలాంటి అధ్యయనాలు చేశారో ప్రభుత్వం వెల్లడించడం లేదు. దీంతో పనుల పేరిట నిధుల స్వాహాకు ప్రభుత్వ పెద్దలు తెరలేపారని జోరుగా ప్రచారం కొనసాగుతున్నది. ప్రభుత్వం చేస్తున్న పనులకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎలాంటి పొంతన లేకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చుతున్నది.
ప్రవేశం పూర్తిగా నిషిద్ధం
ఎస్ఎల్బీసీ పనుల పేరుతో సర్కార్ మరో దోపిడీకి తెరతీసిందన్న అనుమానాలున్నాయి. ప్రభుత్వమే ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి, నిర్మాణ సంస్థలను అడ్డు పెట్టుకొని పనులు చేస్తుండడం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నది. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ (ఎన్ఏటీఎం) న్యూ ఆస్ట్రేన్ టన్నెలింగ్ మెథడ్ అండ్ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు చేపడుతున్నట్టు చెప్తున్న ప్రభుత్వం.. ఈ ప్రాజెక్టుకు రూ.4,637 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. కానీ, పనులకు సంబంధించిన ఏ విషయాన్నీ సర్కార్ బయటకు పొక్కనీయకపోవడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలను, మీడియాను కూడా సొరంగం పనులు జరుగుతున్న ప్రదేశం దరిదాపుల్లోకి అనుమతించకుండా కట్టుదిట్టం చేశారు. వాస్తవంగా ప్రమాదం జరిగిన దోమలపెంట సొరంగం వైపు నుంచి పనులు ఇంకా మొదలు కాలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ‘నోమ్యాన్ జోన్’గా ప్రకటించారు. పూర్తిగా సీజ్ చేసి గోడ కట్టినట్టు సమాచారం. అయితే ఇక్కడ షియర్ జోన్ నుంచి ప్రతిరోజూ వందల లీటర్ల నీళ్లు వస్తున్నాయని గతంలోనే ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం ఆ ప్రదేశాన్ని సీజ్చేసిన షియర్ జోన్ నుంచి వస్తున్న నీటిని ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు.