మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్‌ను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని భారీ నీటిపారుదలశాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ సహాయ చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు. అత్యాధునిక టెక్నాలజీ పరిజ్ఞానాన్ని వినియోగించి సహాయ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని వెల్లడించారు.
రెస్క్యూ టీమ్‌లు రెండు రోజుల్లో టన్నెల్లో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కార్యాచరణం సిద్ధం చేశామని వివరించారు. బుధవారం ఎస్ఎల్బీసీ క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లురవి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు దేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించామని, అత్యాధునిక సదుపాయాలు ఉపయోగిస్తున్నామని తెలిపారు.
వారి సేవలను వినియోగించుకుని సహాయ చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. టన్నెల్లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు వదులుకోలేదని, వారిని సజీవంగా బయటకు తీసుకురావాలన్న ఆశతో సహాయ చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. టన్నెల్లో ప్రమాద ఘటన ప్రాంతంలో 15 ఫీట్ల ఎత్తు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉండడంతో సహాయ చర్యలు నెమ్మదించాయని తెలిపారు. టన్నెల్‌లోని నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించడం ద్వారా టీబీఎం ముందుభాగానికి చేరుకోనున్నట్టు చెప్పారు. టీబీఎం చివరి భాగాలను గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్టు వివరించారు.
వారంతా రాష్ట్రంగాని రాష్ట్రం నుంచి పొట్టచేత పట్టుకొని.. పనుల కోసం వచ్చారు. అనుకోని ప్రమాదంలో చిక్కుకొని మృత్యువుతో పోరాడుతున్నారు. టన్నెల్ వద్ద కార్మికుల కుటుంబాల ఆవేదన అందర్నీ కలచివేస్తున్నది. నాగర్‌కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోశ్ మూడ్రోజుల కిందట సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో పంజాబ్, జార్ఖండ్, కశ్మీర్ నుంచి కుటుంబ సభ్యులు వచ్చారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో నిత్యం వారికి ఎదురుచూపులు తప్పడంలేదు. క్షణక్షణం వారిలో ఆవేదన, ఆందోళన పెరిగిపోతున్నది.
తమ వారు క్షేమంగా రాకపోతారా? అంటూ వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లను ఎవరూ పలకరించడం లేదని, తమ గోడు వినడం లేదని చెట్ల కింద కూర్చుని, తమ వారి ఫొటోలను సెల్ఫోన్లలో చూస్తూ కన్నీరు మున్నీరవుతున్నారు. రోజూ హెలికాప్టర్లలో వస్తున్న మంత్రులు తమ పరిస్థితిని కనీసం అడిగి తెలుసుకోవడం లేదని విలపిస్తున్నారు. ఎల్ఎల్బీసీ సొరంగం పనులు చేపడుతున్న జయప్రకాశ్ కంపెనీ యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ఆ బాధిత కుటుంబాలు అక్కడ పనిచేస్తున్న కూలీల షెడ్లల్లోనే తలదాచుకుంటున్నారు. తమ వారి జాడ కోసం గుండెనిండా బాధ ఉన్నా ఏదో చిన్న ఆశతో నిరీక్షిస్తున్నారు.