సిద్దిపేట/హనుమకొండ, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ 14 నెలల పాలనలో రాష్ట్రంలో నాలుగు ప్రాజెక్టులు కుప్పకూలాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు, నల్లగొండ జిల్లాలో సుంకిశాల, పాలమూరులో వట్టెం పంప్‌హౌస్, తాజాగా ఎస్ఎల్బీసీలో కుప్పకూలాయని వివరించారు. ‘రేవంత్‌రెడ్డీ.. కాళేశ్వరంలో ఒక పిల్లర్ కుంగితే బీఆర్ఎస్ తప్పు చేసిందన్నావు. మీ పాలనలో నాలుగు కుప్పకూలినయి కదా. దీనికి ఏం సమాధానం చెప్తావు?’ అని సూటిగా ప్రశ్నించారు.
బుధవారం ఆయన సిద్దిపేట నియోజకవర్గంలోని పలు శివాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నకోడూరు మండలం విఠలాపూర్-రంగాయిపల్లి గ్రామాల వద్ద కాలువలోకి నీళ్లు వదలారు. బుధవారం రాత్రి హనుమకొండలోని జనగామ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయా చోట్ల హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ ప్రచారం చేస్తున్న మూర్ఖులకు గలగలా పొలాల్లో పారుతున్న కాళేశ్వరం నీళ్లే జవాబు అని చెప్పారు. ఇక్కడ పారుతున్న నీళ్లును చూసైనా, కండ్లు తెరవాలని హితవు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎట్లా వస్తున్నాయో ఈ ప్రాంత రైతులను అడిగితే చెప్తారని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోనో లేక గాంధీభవన్‌లోనో కూర్చొని మాట్లాడటం కాదు, పల్లెల్లోకి వచ్చి గోదావరి జలాలను చూసి మేలోవాలని చురకలేశారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని, కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే ఈ పంటలు పండేవి కావని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గత ఐదేండ్ల నుంచి ప్రతి గుంట సాగులోకి వచ్చిందని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు రావడంతో బంగారం లాంటి పంటలు పండుతున్నాయని, కేసీఆర్ కృషి వల్లే అది సాధ్యమైందని చెప్పారు. రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్లు కాళేశ్వరంలో భాగం కావా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా కుంగిపోయిన పిల్లర్‌ను బాగు చేసి, పొలాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం దండగ కాదు, పండుగ అని రైతులందరూ చెప్తారని హరీశ్‌రావు పేర్కొన్నారు. పొలాల మధ్య నిలబడి మాట్లాడుతున్నా, ఈ నీళ్లన్నీ కాళేశ్వరం వల్లే సాధ్యమయ్యాయి, కేసీఆర్ వల్లే వచ్చాయని తెలిపారు. అంతకుముందు కరెంట్ లేదు, నీళ్లు లేవు, ఇప్పుడు రెండు పంటలు పండుతున్నాయంటే కాళేశ్వరం వల్లేనని స్పష్టంచేశారు. ఇప్పటికైనా, మరమ్మతులు చేసి చిట్టచివరి భూములకు కూడా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, సొరంగంలో చిక్కుకున్న కార్మికులను ఎప్పటిలోగా బయటకు తీసుకొస్తారని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎనిమిది మంది సొరంగంలో చిక్కుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ వేసుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాజకీయాలు తప్ప ప్రజల ప్రాణాలు లెక్కలేదన్నారు. గురువారం ఎస్ఎల్బీసీ సందర్శనకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వెళ్తుందని చెప్పారు. ఎస్ఎల్బీసీ ఘటనకు బీఆర్ఎస్కు ఏ సంబంధం ఉన్నదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు, నిర్లక్ష్యంతోనే 8 మంది ప్రాణాలు మీదికి వచ్చిందని ధ్వజమెత్తారు.
దీనిపై ఎన్డీఎస్ఏ బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు సంఘటన జరిగిన చోటుకు వెళ్లకుండా, సమీక్షించకుండా పరిస్థితి ఏమిటో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రూ.3,900 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. సరైన సమయంలో గేట్లు తెరువకపోవడంలోనే పెద్దవాగు కొట్టుకపోయిందని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సోయి ఉండే మాట్లాడుతున్నాడా అని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీపై కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పాలనలోనే 12 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకం జరిపామని, ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో కనీసం ఒక కిలోమీటర్ టన్నెల్ అయినా తవ్వారా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందని, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని విమర్శించారు. రాజలింగమూర్తి హత్య విషయంలో ఎస్పీ ఒక మాట చెప్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉన్నదని హరీశ్‌రావు చెప్పారు.