SLBC Tunnel | నాగర్‌కర్నూల్, మార్చి 4 : ఎల్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారి కోసం రెస్క్యూ టీమ్ చేపడుతున్న సహాయ చర్యల్లో స్వల్ప పురోగతి సాధించింది. మంగళవారం 11వ రోజు కన్వేయర్ బెల్ట్‌ను సిద్ధం చేసి టన్నెల్లో పేరుకుపోయిన మట్టి, రాళ్లను తొలగించి బయటకు తరలించే ప్రక్రియను ప్రారంభించారు. ఓవైపు నీటిని హెవీ మోటర్ల ద్వారా బయటకు తరలిస్తూ మరో వైపు కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తోడిపోస్తున్నారు.
టన్నెల్‌లోని జీరో పాయింట్ నుంచి 12వ కిలోమీటర్ వరకు నీరు నిల్వ ఉండడంతో ఓవైపు డీవాటరింగ్ చేస్తున్నారు. పూర్తిగా మట్టిని, శిథిలాలను బయటకు తీస్తేనే మృతదేహాలు వెలుగుచూసే అవకాశం ఉండడంతో రెస్క్యూ టీమ్ వేగం పెంచింది. జీరో పాయిట్ వద్ద డీటీ నాగిరెడ్డి పర్యవేక్షించారు. టీబీఎం మిషన్ కటింగ్ పనులు వేగంగా కొనసాగుతుండడంతో త్వరలో మృతదేహాలు బయటపడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
రెస్క్యూ ఆపరేషన్‌ను డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, కలెక్టర్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ డీజీపీ నాగిరెడ్డి, టీఎస్ఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్‌అలీ, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కల్నల్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారి ప్రసన్న, హైడ్రా, సింగరేణి మైన్స్, ఎస్డీఆర్ఎఫ్ తదితర రెస్క్యూ బృందాల ప్రతినిధులు పాల్గొన్నాయి.