Uttam Kumar Reddy | హైదరాబాద్, జూన్11 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగ ప్రమాదం కారణంగా ఇన్లెట్లోని టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) పూర్తిగా దెబ్బతిన్నదని, అది ఇక పనికిరాదని, ఆ శిథిలాలను బయటకు తీయడానికి కూడా సాధ్యపడదని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. అత్యాధునిక టెక్నాలజీతో పక్కనుంచి మరో సొరంగ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్‌శక్తి, రక్షణ శాఖ మంత్రులతోపాటు సీడబ్ల్యూసీ చైర్మన్, ఎన్డీఎస్ఏ చైర్మన్‌ను మంత్రి ఉత్తమ్ బుధవారం కలిశారు. అనంతరం అక్కడి మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వెల్లడించారు.
ఎస్ఎల్బీసీలో మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగం పనులను వచ్చే రెండేండ్లలో పూర్తిచేయడానికి చర్యలు చేపడుతున్నామని, అందుకోసం రక్షణ శాఖ సహకారాన్ని కోరామని వివరించారు. ఆర్మీలోని కల్నల్ పరీక్షిత్ మెహ్రా, సరిహద్దు రోడ్డు సంస్థ మాజీ డీజీ జనరల్ హర్పాల్‌సింగ్‌ను తెలంగాణ రాష్ర్టానికి డిప్యూటేషన్‌పై పంపేందుకు కేంద్రం అంగీకరించిందని, సొరంగాల నిర్మాణంలో వారిరువురూ నిష్ణాతులని వెల్లడించారు. పరీక్షిత్ మెహ్రాను ప్రత్యేక కార్యదర్శిగా, జనరల్ హర్పాల్‌సింగ్‌ను గౌరవ సలహాదారుగా తీసుకుంటున్నామని వెల్లడించారు. అంతేకాకుండా ఎన్జీఆర్ఐ నిష్ణాతుడు ప్రొఫెసర్ తివారీతోపాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ సూల్ ఆఫ్ మైన్స్ సహకారం కూడా తీసుకోవాలని భావిస్తున్నదని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో తాను ఇక పోటీచేయబోనని, ఇదే తన ఆఖరి టర్మ్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పుడు తనకు 62 ఏండ్ల వయసని, ఇక రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయబోనని చెప్పారు. ఇప్పటివరకు తాను ఏడు పర్యాయలు వరుసగా చట్టసభలకు ఎన్నికవుతూ వచ్చానని గుర్తుచేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ అయ్యారు.