ఎల్లారెడ్డి రూరల్, జూలై 4: రహదారిని ఆక్రమించి ఇంటిని నిర్మించారని పేర్కొంటూ దాన్ని తొలగించడానికి అధికారులు సిద్ధం కాగా, కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎల్లారెడ్డి మాజీ వైస్ ఎంపీపీ, బీజేపీకి చెందిన పెద్దడ్ల నర్సింహులు మల్కాపూర్‌లో ఇల్లు కట్టుకుంటున్నాడు. తన సొంత స్థలంతో పాటు 12 అడుగుల మేర రహదారిని ఆక్రమించి నిర్మాణం చేపట్టారని గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు వారంక్రితం వచ్చి విచారణ జరిపారు.
రోడ్డును ఆక్రమించినట్టు గుర్తించిన ఎల్లారెడ్డి డీపీవో సురేందర్, ఎంపీడీవో ప్రకాశ్, జీపీ కార్యదర్శి ప్రదీప్ అక్రమ కట్టడాన్ని తొలగించడానికి శుక్రవారం భారీబందోబస్తుతో గ్రామానికి చేరుకున్నారు. కూల్చివేతను అడ్డుకునేందుకు నర్సింహులు కుటుంబం యత్నించడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కూల్చవద్దని కోరుతూ కుటుంబసభ్యులు స్లాబ్ పైకెక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని కిందకు తీసుకొచ్చి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆరు అడుగుల మేర భవనాన్ని కూల్చి వేయించారు.