
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): దేశంలోనే తొలిసారి ఏడు నెలల బాలుడికి అత్యాధునిక అలర్జెస్ స్కిన్ ప్రిక్ టెస్ట్ నిర్వహించినట్టు హైదరాబాద్లోని అశ్విని అలర్జీ సెంటర్ తెలిపింది. సోమాలియాకు చెందిన బాలుడు అలర్జిక్ రైనైటిస్ (ముక్కు ధారగా కారటం), ఆటోపిక్ అలర్జిక్ ఎగ్జిమా (దురదలు, దద్దుర్లు), కండ్లు ఎర్రబడటం వంటి తీవ్ర లక్షణాలతో బాధపడుతున్నాడు. శనివారం అతడికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించి నొప్పి తెలియకుండా స్కిన్ ప్రిక్ టెస్ట్ నిర్వహించారని దవాఖాన నిర్వాహకుడు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ తెలిపారు. పరీక్షలో ఆరుగురు సీనియర్ అలర్జిస్ట్లు, ఇమ్యునాలజిస్ట్లు పాల్గొన్నారని, అమెరికాకు చెందిన డాక్టర్ పీకే వేదాంతన్ సలహాలు తీసుకొన్నామని వివరించారు.
ఏమిటీ టెస్ట్
అలర్జీ కారకాలను సులభంగా గుర్తించేందుకు చేసేదే స్కిన్ ప్రిక్ టెస్ట్. చేతిపై పెన్నుతో కొన్ని గుర్తులు పెట్టి అలర్జీ కారక నమూనాలను గుర్తులున్న చోట ఉంచుతారు. ఆ తర్వాత గుర్తులున్న చోట చిన్నగా చర్మాన్ని తొలిచినట్టు చేస్తారు. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు. చర్మం లోపలికి పదార్థాలు వెళ్లాక ఏది అలర్జీకి కారణం అవుతుందో ఆ చోట దద్దుర్లు, దురద పుడతాయి. అలా అలర్జీ కారకాలను గుర్తించవచ్చు.