Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు డిగ్రీ చదువుతూనే నెలకు రూ.10 వేలు సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1,054 డిగ్రీ కాలేజీలుండగా, అత్యధిక అడ్మిషన్లున్న 103 కాలేజీల్లో ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందులో 37 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలుండగా, 66 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 56 కాలేజీలు ఓయూ పరిధిలోనే ఉన్నాయి. సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో ఈ కోర్సులను నిర్వహిస్తారు. ఈ కోర్సులను ప్రవేశపెట్టడం సహా నిర్వహణపై సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి.. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా వర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ప్రతినిధి సుబ్బారావుతో రోడ్‌మ్యాప్‌పై చర్చించారు. ఈ నెల 28న మరోమారు సమావేశమై, పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను తయారుచేయాలని నిర్ణయించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఈ దిశగా చేపట్టిన చొరవతో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే కోర్సులివి. వీటిలో చేరడం ద్వారా విద్యార్థులకు నెలకు కొంత ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక అపోలో, ఎల్ఎండ్టీ వంటి సంస్థల్లో ప్లేస్మెంట్ కల్పిస్తాం. విద్యార్థులు సాధించిన క్రెడిట్స్ మార్పిడి, మేజర్, మైనర్ కోర్సుల అమలుపై సమాలోచనలు చేస్తున్నాం. ఈ నెల 28న మరోమారు వర్సిటీ వీసీలు, ప్రిన్సిపాళ్లతో సమావేశమవుతాం. కోర్సుల నిర్వహణలో అవాంతరాలు లేకుండా కాలేజీలకే పూర్తిస్వేచ్ఛనిస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్