నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 19: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపైకి నీరు చేరింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పిడుగుపాటుకు గురై రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. ఒక జోగుళాంబ గద్వాల జిల్లాలోనే ముగ్గురు మృతి చెందారు. అలంపూర్ మండలం క్యాతూరులో రైతు వేముల రాజు (35), మల్దకల్‌లోని వడ్డె ఆదిలక్ష్మి(15), గట్టు మండలం ఆరగిద్ద శివారులో తలారి నల్లారెడ్డి(30) పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందారు.
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని బిట్టూరుపల్లిలో జక్కుల భాస్కర్‌గౌడ్(57), వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంకిరెడ్డిపల్లిలో విద్యార్థి కార్తీక్ (15) పిడుగుపడి మృతిచెందారు. గమనించని ఆర్టీసీ డ్రైవర్ ముందుకెళ్లడంతో బస్సు నీళ్లలో చిక్కుకుపోయింది. సగం మేర బస్సు నీటిలో మునిగిపోవడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్థానికులు హుటాహుటిన స్పందించి బస్సులోని మహిళలు, చిన్నారులను సురక్షితంగా బయటకు చేర్చారు. నల్లగొండ జిల్లాలోని పిట్టలగూడెంలో రామసాని నరేందర్‌రెడ్డికి చెందిన కోళ్ల షెడ్ కూలి అయిదు వేల కోడి పిల్లలు మృతి చెందాయి.