పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని (Panchayat Raj staff) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ముత్తారం ఎంపీడీవో కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ సిబ్బంది విధులకు గైర్హాజరవడం గమనించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్లు పరిశీలించారు.
కాగా, సదరు సిబ్బంది అనుమతి లేకుండా చాలా రోజులుగా విధులకు డుమ్మా కొట్టడం గమనించిన కలెక్టర్, పలుమార్లు ఆ సిబ్బందికి మెమోలు జారీ చేసినప్పటికీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముత్తారం మండల ఎంపీడీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎండీ ఖాదర్ పాషా, జూనియర్ అసిస్టెంట్ వి. నరేష్, కార్యాలయ సభర్డినేట్ ఎండీ ఫయాజ్, ఎంపీడీవో కార్యాలయలో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు సురేందర్, ఫయాజ్, జైపాల్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.