హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): షాద్నగర్, మక్తల్ అటవీప్రాంతాల్లో జంతువులను వేటాడి, వాటి మాంసం తింటున్న ఆరుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ కమిషనరేట్ గోల్కొండ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, అటవీఅధికారులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నాలుగు ఎయిర్గన్లు, ఒక లైసెన్స్డ్ రైఫిల్, 20తూటాలు, కారు, 8సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో నలుగురు హైదరాబాద్కు చెందిన వారు కాగా, ఒకరు నారాయణపేట, మరొకరు జడ్చర్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు పట్టుబడిన ప్రధాన నిందితుడు హైదరాబాద్కు చెందిన పక్షుల వ్యాపారి మహ్మద్ ముజాఫర్ హుస్సేన్ ఈ ముఠాను ఏర్పాటు చేసినట్టు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ముజఫర్తో పాటు అరెస్టయిన వారిలో జడ్చర్లకు చెందిన విద్యార్థి మీర్ అహ్మద్ అమీర్, హైదరాబాద్కు చెందిన అబ్దుల్లా బిన్ సహైన్, సౌద్ బిన్ మహ్మద్ బలాబ్, మసూద్ బిన్ మొహమ్మద్లతో పాటు ముస్తిపల్లికి చెందిన వన్యప్రాణుల ఆచూకీ తెలిపే వ్యక్తి శేఖర్ ఉన్నారు. నిందితులంతా ఏడాది గా షాద్నగర్, మక్తల్ అటవీ ప్రాంతాల్లో అనేక సార్లు వేట సాగించారని పోలీసులు తెలిపారు.