పెంట్లవెల్లి, జూలై 23 : కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి గ్రామ మహిళలు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌తో మొరపెట్టుకున్నారు. పెంట్లవెల్లి మండల కేంద్రంలో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులతోపాటు రామాపురం కత్వ నుంచి పెంట్లవెల్లి చౌట చెరువుకు సాగునీరు పారే కాల్వను బుధవారం ఆయన స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయన వద్దకు వచ్చి రుణమాఫీ అడ్రస్ లేదని.. రైతు భరోసా పడలేదని వాపోయారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.2,500, రూ.500కే గ్యాస్ కనెక్షన్, కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇవ్వడం లేదని బీరం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. హామీల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇరవై నెలలైనా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు.