హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్ పరీక్షల్లో బుధవారం బోటనీలో రెండు, గణితంలో ఒక ప్రశ్న చొప్పున తప్పులు దొర్లాయి. బోటనీలో 5,7 ప్రశ్నల్లో తప్పులు రాగా, గణితంలో 4వ ప్రశ్న తప్పుగా ఇచ్చారు. మంగళవారం మూడు సబ్జెక్టుల్లో ఆరు తప్పులు వెలుగుచూశాయి. సోమవారం ఇంగ్లిష్ ప్రశ్నపత్రం మసకగా ముద్రితంకావడంతో విద్యార్థులకు 4 మార్కులు కేటాయించారు.
దీంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. తప్పులను గుర్తించిన అధికారులు వాటిని సవరించుకోవాలని సూచిస్తున్నారు. బుధవారం 3 మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 2, సిద్దిపేటలో 1 చొప్పున నమోదయ్యాయి. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ విద్యార్థులను అధికారులు డిబార్ చేశారు. 4,67,289 మంది విద్యార్థులకు 4,54,031 మంది పరీక్షకు హాజరుకాగా, 13,258 మంది (2.83శాతం) గైర్హాజరయ్యారు.