హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ) : నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె శివారులో డిండి నది ఒడ్డున గల 3500 ఏండ్ల నాటి ప్రసిద్ధిగాంచిన నిలువురాయి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. పురావస్తు అన్వేషణలో భాగంగా గురువారం ఆయన ఇనుప యుగం నాటి ఈ రాయిని గుర్తించారు.
ఈ సందర్భంగా దీని ప్రాశస్థ్యాన్ని వివరిస్తూ.. ఇనుప యుగంలో ఓ ప్రముఖుడి స్మరణార్థం ఈ రాయిని ఏర్పాటుచేశారని, దీనిని మెన్హిర్ అంటారని తెలిపారు. 8 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, అడుగున్నర మందం గల ఈ రాయిని కాపాడుకొని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. ఆయన వెంట తిప్పర్తి జగన్మోహన్రెడ్డి, అభిలాష్‌రెడ్డి, బడే సాయికిరణ్‌రెడ్డి ఉన్నారు.